షమీ శకం ముగిసింది.. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదు: దినేశ్ కార్తీక్

షమీ శకం ముగిసింది.. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదు: దినేశ్ కార్తీక్

Shami era is over no point in taking him back to the team says former cricketer
  • షమీ శకం ముగిసిందని, జట్టు ముందుకు సాగిపోయిందని స్పష్టీక‌ర‌ణ‌
  • వెస్టిండీస్‌తో సిరీస్‌లో బౌలర్లు విఫలమైనా షమీ అవసరం లేదని వ్యాఖ్య
  • రోహిత్, కోహ్లీ మాత్రం జట్టులో కొనసాగాలని కార్తీక్ ఆకాంక్ష
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఇప్పటికే షమీని దాటి ముందుకు వెళ్లిపోయిందని, ఇప్పుడు అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవడంలో ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశాడు.

2025లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మహమ్మద్ షమీ, అప్పటి నుంచి గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు, కొన్నిసార్లు ఇతర కారణాలతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, జాతీయ జట్టులో అతడి పునరాగమనంపై ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. 

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలిచినప్పటికీ, భారత బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై మన బౌలర్లు తేలిపోవడంతో, అనుభవజ్ఞుడైన షమీని తిరిగి తీసుకురావాలనే చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ దినేశ్ కార్తీక్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. "షమీని తిరిగి జట్టులోకి తీసుకోవాలా అని అడిగితే నా సమాధానం వద్దనే. భారత జట్టులో ఇప్పటికే చాలా మంది పేసర్లు ఉన్నారు. జట్టు షమీని దాటి ముందుకు సాగింది. ఇప్పుడు వెనక్కి వెళ్లడంలో అర్థం లేదు. షమీ దేశవాళీలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, అతడిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు" అని కార్తీక్ అన్నాడు. 

ప్రస్తుతం జట్టులో మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ వంటి పేసర్లు ఉండగా.. గుర్నూర్ బ్రార్, అకిబ్ నబీ, అన్షుల్ కంబోజ్ వంటి యువ బౌలర్లకు అవకాశాలు ఇస్తున్నారని గుర్తుచేశాడు.

ఆసక్తికరంగా షమీ విషయంలో కఠినంగా వ్యవహరించిన కార్తీక్.. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించాడు. వారిద్దరూ జట్టులో కొనసాగాలని ఆకాంక్షించాడు. వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత వారు రిటైరైతే వన్డే క్రికెట్ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. 

"రోహిత్, కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లోని అతిపెద్ద స్టార్లు. ప్రపంచ క్రికెట్‌కు కేంద్రంగా ఉన్న భారత్‌కు చెందిన ఈ ఇద్దరు మేటి ఆటగాళ్లు తప్పుకుంటే, అది కచ్చితంగా ఆటపై తీవ్ర ప్రభావం చూపుతుంది" అని కార్తీక్ వివరించాడు.
Advertisement
Mohammed Shami
Dinesh Karthik
Team India
Indian Cricket Team
Cricket News
Fast Bowlers

More Telugu News