ఒక మహిళ ఇంటిని ఎలా చక్కదిద్దుతుందో, దేశాన్ని నిర్మల అలా తీర్చిదిద్దుతున్నారు: చంద్రబాబు
Advertisement

ఒక మహిళ ఇంటిని ఎలా చక్కదిద్దుతుందో, దేశాన్ని నిర్మల అలా తీర్చిదిద్దుతున్నారు: చంద్రబాబు

Nirmala Sitharaman is shaping India like a woman manages her home says Chandrababu Naidu
  • మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన
  • హాజరైన కేంద్ర మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, అనంత్ అంబానీ
  • రూ.లక్ష కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపుదిద్దుకోనున్న ప్రాజెక్టు
  • నిర్మలా సీతారామన్‌ను ఉక్కు మహిళగా అభివర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక 'ఉక్కు మహిళ' అని, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ మహిళ ఇంటిని ఎంత చక్కగా తీర్చిదిద్దగలదో, అదే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆమె నాయకత్వ పటిమను గుర్తించే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగించారని చంద్రబాబు పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ వంటి నెక్స్ట్‌జెన్ సంస్కరణలు, డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల్లో పారదర్శకత తీసుకురావడం ద్వారా దేశాన్ని బలోపేతం చేస్తున్న ఘనత నిర్మలా సీతారామన్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారమే కారణమని స్పష్టం చేశారు.

అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోందని గుర్తుచేశారు. ముఖ్యంగా, మదనపల్లెలో ఏర్పాటు కానున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కోసం నిధుల కేటాయింపులో నిర్మలా సీతారామన్ చూపిన చొరవ, అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేమని చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్

ఇవాళ, మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేశ్ కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో కేంద్ర సహకారంతో రూ.40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మరో రూ.60 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.


Advertisement
Nirmala Sitharaman
Chandrababu Naidu
Global Horticulture Hub
Madanapalle
Anant Ambani
Indian School of Agriculture

More Telugu News