గతంలో నఖ్వీ నుంచి ట్రోఫీ వద్దన్న భారత్.. ఇప్పుడు ఆసియా క్రీడల ఫైనల్‌ వేళ మరో ఆసక్తికర పరిణామం
Advertisement

గతంలో నఖ్వీ నుంచి ట్రోఫీ వద్దన్న భారత్.. ఇప్పుడు ఆసియా క్రీడల ఫైనల్‌ వేళ మరో ఆసక్తికర పరిణామం

Mohsin Naqvi To Skip India vs Pakistan Asian Games Cricket Final
  • భారత్-పాక్ ఫైనల్‌కు నఖ్వీ దూరం
  • గతంలో ఆసియా కప్ లో నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోని భారత్
  • అలాగే వ్యవహరించిన మహిళల జట్టు
  • తాజాగా ఆసియా క్రీడల ఫైనల్‌లో తలపడనున్న భారత్-పాక్
  • మ్యాచ్‌ అనంతరం కరచాలనంపై ఆసక్తి
భారత్-పాకిస్థాన్ మధ్య ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ స్వర్ణ పతక మ్యాచ్‌ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ మ్యాచ్‌కు హాజరు కావడం లేదు. గతంలో ఆసియా కప్ భారత్‌ గెలిచినప్పుడు నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకపోవడం, ఇటీవల భారత మహిళల జట్టు కూడా ఇదే విధంగా వ్యవహరించడంతో.. ఈసారి ఏషియన్ గేమ్స్ ఫైనల్‌ తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.

2025 పురుషుల టీ20 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించింది. ఫైనల్‌లోనూ విజయం సాధించిన భారత జట్టు.. నఖ్వీ నుంచి ట్రోఫీ స్వీకరించలేదు. ఇటీవల జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన భారత మహిళల జట్టు కూడా నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోలేదు. ఆసియా క్రీడల్లో గెలిస్తే మళ్లీ నఖ్వీ చేతుల మీదుగా భారత్‌ స్వర్ణ పతకాలు తీసుకోవాల్సి వస్తుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో భారత్‌ పతకాలు స్వీకరిస్తుందా? లేదా? అనే ఆసక్తి వ్యక్తమైంది. కానీ, ఆయనే స్వయంగా రాననడంతో ఉత్కంఠకు తెరపడింది.

ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగే ఫైనల్స్ డేకు నఖ్వీ రాలేకపోతున్నట్లు ఏసీసీ వెల్లడించింది. భారత్, పాకిస్థాన్‌తో పాటు.. కాంస్య పతకం కోసం ఆడనున్న బంగ్లాదేశ్, శ్రీలంకకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నఖ్వీ పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు చీఫ్‌ గానే కాకుండా, ఆ దేశ కేంద్ర ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగానూ ఉన్నారు.

సెమీఫైనల్లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. మరో సెమీఫైనల్లో భారత్ 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో స్వర్ణ పతకం కోసం భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.

2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల క్రికెట్‌ మ్యాచ్ లలో కరచాలనాలకు దూరంగా ఉన్న సందర్భాలు కనిపించాయి. దీంతో ఆసియా క్రీడల ఫైనల్లోనూ మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య సంప్రదాయ కరచాలనం ఉంటుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Advertisement
Mohsin Naqvi
India vs Pakistan Final
Asian Games Cricket
ACC President
PCB Chairman
Gold Medal Match

More Telugu News