ఒళ్లంతా నొప్పులే.. అయినా అదరగొట్టా: కెప్టెన్‌ గిల్
Advertisement

ఒళ్లంతా నొప్పులే.. అయినా అదరగొట్టా: కెప్టెన్‌ గిల్

Shubman Gill performed well despite body pains says Captain after double century
  • భారీ లక్ష్యఛేదనలో కెప్టెన్‌ గిల్ అజేయ డబుల్ సెంచరీ
  • వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు
  • కెప్టెన్‌గా వన్డే, టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు
  • తీవ్రమైన వేడి, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడ్డానని చెప్పిన గిల్
  • తమ బౌలింగ్ మెరుగ్గా లేదని అంగీకరించిన భారత కెప్టెన్
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) విధ్వంసకర డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తీవ్రమైన వేడి, కండరాల నొప్పులతో పోరాడుతూనే అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడిన గిల్.. టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 39 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద విజయవంతమైన ఛేదన కావడం విశేషం.

రికార్డుల మోత మోగించిన గిల్‌
ఈ మ్యాచ్‌లో గిల్ ఆడిన ఇన్నింగ్స్ రికార్డుల మోత మోగించింది. కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ (126 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (గ్లెన్ మ్యాక్స్‌వెల్ 201*) రికార్డును కూడా గిల్ అధిగమించాడు. 

అంతేకాకుండా కెప్టెన్‌గా టెస్టులు, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన ఇన్నింగ్స్‌లో 26 ఫోర్లు, 8 సిక్సర్లు బాదిన గిల్.. 167.67 స్ట్రైక్ రేట్‌తో విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు.

ఆట అనంతరం గిల్ మాట్లాడుతూ.. తన శరీరం తీవ్రమైన నొప్పితో బాధపడిందని తెలిపాడు. "ప్రస్తుతం నా శరీరంలోని ప్రతి భాగం నొప్పితో బిగుసుకుపోయింది. మధ్యాహ్నం చాలా వేడిగా ఉంది. 400 పరుగుల లక్ష్యం ఎంత మంచి వికెట్ అయినా, ఎంత చిన్న గ్రౌండ్ అయినా ఛేదించడం సులభం కాదు. జట్టు కోసం చివరి వరకు నిలిచి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని గిల్ పేర్కొన్నాడు.

మా వ్యూహాం అదే..
ఛేదనలో తమ వ్యూహాన్ని వివరిస్తూ.. "భారీ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకున్నాం. పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 75-80 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త బంతితో కాస్త జాగ్రత్తగా ఆడి, బంతి పాతబడ్డాక వేగంగా ఆడాలనుకున్నాం. ఒకవైపు బౌండరీ చిన్నగా ఉండటంతో ఫాస్ట్ బౌలర్లను లక్ష్యంగా చేసుకున్నాం. 25 ఓవర్లకు 210 పరుగులు చేస్తే చాలనుకున్నాం, కానీ మేము 230 పరుగులు దాటాం. ఆ తర్వాత మాపై ఒత్తిడి పూర్తిగా తొలగిపోయింది" అని వివరించాడు.

భారత బౌలింగ్ పై కెప్టెన్‌ అసంతృప్తి 
అయితే, భారత బౌలింగ్ ప్రదర్శనపై గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. "తొలి మ్యాచ్‌లాగే ఈ మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలో మా బౌలర్లు సరిగా బౌలింగ్ చేయలేదు. విండీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడారు. ఒక దశలో వారు 420-430 పరుగులు చేస్తారనిపించింది. చివరిలో వారిని 405 పరుగులకు కట్టడి చేయడం మాకు ఒక బోనస్ లాంటిది" అని అంగీకరించాడు. సిరీస్ ఇప్పటికే గెలిచినందున, చివరి వన్డేలో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని గిల్ సూచించాడు.
Advertisement
Shubman Gill
India West Indies 2nd ODI
Fastest ODI Double Century
Shubman Gill 223 Not Out
India Series Win
Highest ODI Chase Score

More Telugu News