షుగర్ ఫ్రీ.. హై ప్రొటీన్.. మల్టీగ్రెయిన్: ఈ మాటల వెనుక అసలు మతలబు ఇదే
Advertisement

షుగర్ ఫ్రీ.. హై ప్రొటీన్.. మల్టీగ్రెయిన్: ఈ మాటల వెనుక అసలు మతలబు ఇదే

Sugar Free High Protein Multigrain The Real Meaning Behind These Words
  • ‘మల్టీగ్రెయిన్’లో రిఫైన్డ్ ధాన్యాలు ఉండే ఛాన్స్‌
  • ‘నో యాడెడ్ షుగర్’ అంటే షుగర్ అసలే లేదని కాదంటున్న నిపుణులు
  • ‘షుగర్ ఫ్రీ’ ఉత్పత్తుల్లో ఎక్కువ క్యాలరీలు ఉండే ఛాన్స్‌
  • ‘హై ప్రొటీన్’తో ఆరోగ్యం గ్యారంటీ కాదని వెల్లడి
  • ‘ప్లాంట్ బేస్డ్’లోనూ కొవ్వులు, సోడియం ఉండే అవకాశం
సూపర్ మార్కెట్‌కు వెళ్లగానే మన కంటికి ముందుగా కనిపించేది ప్యాకెట్ ముందు భాగమే. ‘నేచురల్’, ‘మల్టీగ్రెయిన్’, ‘షుగర్ ఫ్రీ’, ‘హై ప్రొటీన్’, ‘ప్లాంట్ బేస్డ్’.. ఇలా రకరకాల పదాలు కనిపిస్తాయి. వాటిని చూసి ఇది ఆరోగ్యకరమైన ఆహారమేనని చాలామంది అనుకుంటారు. కానీ ప్యాకెట్‌పై కనిపించే మాటలకంటే.. వెనుక ఉన్న లేబుల్‌ అసలు విషయం చెబుతుంది. అందుకే ప్యాకెట్ కొనేముందు కొన్ని పదాల అసలు అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

‘మల్టీగ్రెయిన్’ అంటే
మల్టీగ్రెయిన్ అంటే ఒకటి కంటే ఎక్కువ రకాల ధాన్యాలు ఉన్నాయని అర్థం. అయితే అందులో ఉన్న ధాన్యాలన్నీ తప్పనిసరిగా సంపూర్ణ ధాన్యాలు కావాల్సిన అవసరం లేదు. అవి రిఫైన్డ్ ధాన్యాలు కూడా కావచ్చు. అందుకే పదార్థాల జాబితాలో మొదట ‘వోల్ వీట్’ లేదా ‘వోల్ గ్రెయిన్’ ఉందో చూడాలి.

‘నో యాడెడ్ షుగర్’..
‘నో యాడెడ్ షుగర్’ అంటే తయారీ సమయంలో అదనంగా చక్కెర కలపలేదని అర్థం. అంతే తప్ప ఆ ఉత్పత్తిలో చక్కెర అసలు ఉండదని కాదు. పండ్లు లేదా పాలతో తయారైన ఉత్పత్తుల్లో సహజ చక్కెర ఉండొచ్చు. అందుకే ప్యాకెట్‌పై ఉన్న మొత్తం షుగర్ వివరాలను కూడా చూడాలి.

‘షుగర్ ఫ్రీ’ చూసి కొనొద్దు
షుగర్ ఫ్రీ బిస్కెట్లు, చాక్లెట్లు కనిపిస్తే చాలామందికి అవి పూర్తిగా ఆరోగ్యకరమైనవిగా అనిపిస్తాయి. కానీ రుచిని నిలబెట్టేందుకు కొన్ని ఉత్పత్తుల్లో కృత్రిమ స్వీటెనర్లు లేదా కొవ్వులు ఉపయోగించవచ్చు. ఫలితంగా చక్కెర లేకపోయినా క్యాలరీలు, శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మొత్తం ఎనర్జీ విలువను కూడా పరిశీలించాలి.

‘హై ప్రొటీన్’ అని ఉంటే
ప్రొటీన్ ఎక్కువగా ఉందని చెప్పే సిరియల్స్, బార్స్ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ‘హై ప్రొటీన్’ అని ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యకరమైనదని కాదు. కొన్ని ప్రొటీన్ ఉత్పత్తుల్లో సోడియం, శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ లేదా చక్కెరలు ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా ఒక సర్వింగ్‌లో ఎంత పరిమాణం ఉందో తప్పకుండా చూడాలి.

‘ప్లాంట్ బేస్డ్’ అంటే ఆరోగ్యకరమేనా?
ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లో సహజంగానే కొలెస్ట్రాల్ ఉండదు. అయితే వాటిలో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, సోడియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొవ్వు తగ్గించినప్పుడు రుచి కోసం చక్కెర లేదా ఉప్పును ఎక్కువగా జోడించే ఉత్పత్తులు కూడా ఉండొచ్చు. అందుకే ‘ప్లాంట్ బేస్డ్’ అనే పదం కనిపించిందని మాత్రమే నిర్ణయం తీసుకోకూడదు.

‘నో ప్రిజర్వేటివ్స్’ అంటే?
‘నో ప్రిజర్వేటివ్స్’ అనే మాట కూడా ఆరోగ్యకరమైన ఉత్పత్తి అనే భావన కలిగిస్తుంది. కానీ ప్రిజర్వేటివ్స్ లేకపోవడం వల్లే ఆహారం ఎక్కువ పోషక విలువ కలిగి ఉంటుందని చెప్పలేం. కొన్ని ఉత్పత్తులు ఎక్కువ ప్రాసెసింగ్, ఫ్రీజింగ్ లేదా ప్రత్యేక ప్యాకేజింగ్ విధానాలపై ఆధారపడవచ్చు.

ప్యాకెట్ వెనకే అసలు నిజం
ప్యాకెట్ ముందు భాగం మన దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. అసలు వివరాలు మాత్రం వెనుక ఉన్న న్యూట్రిషన్ లేబుల్‌లో ఉంటాయి. కొనేముందు పదార్థాల జాబితా, సర్వింగ్ పరిమాణం, క్యాలరీలు, ప్రొటీన్, మొత్తం చక్కెర, శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, సోడియం, ఫైబర్ వంటి వివరాలను పరిశీలించాలి.

అంటే.. ప్యాకెట్‌పై కనిపించే ‘హెల్తీ’ మాటలను మాత్రమే నమ్మకుండా, అందులో నిజంగా ఏముందో చదివి తెలుసుకోవాలి. ఇకపై షాపింగ్‌కి వెళ్లినప్పుడు ముందు భాగం చూసి ప్యాకెట్ తీసుకునే బదులు.. ఒక్కసారి వెనక్కి తిప్పి లేబుల్ చదివితే చాలు. ఆరోగ్యకరమైన ఎంపికలో అదే మొదటి అడుగు.
Advertisement
Food Labels
Sugar Free
High Protein
Multigrain
Nutrition Labeling
Healthy Diet

More Telugu News