వాట్సాప్‌లో టీనేజర్ల భద్రత.. కొత్తగా పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లు
Advertisement

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రత.. కొత్తగా పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లు

WhatsApp safety for teenagers new parental control features
  • వాట్సాప్‌లో టీనేజర్ల కోసం కొత్తగా పేరెంటల్ కంట్రోల్స్
  • టీనేజర్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను నియంత్రించనున్న తల్లిదండ్రులు
  • పేరెంట్స్ సెట్ చేసిన పిన్‌తోనే సెట్టింగ్స్ మార్పుకు వీలు
  • కాల్స్, మెసేజ్‌లు మాత్రం ఎప్పటిలాగే పూర్తి రహస్యంగా భద్రం
  • ఆన్‌లైన్ భద్రతపై చర్చను ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి
టీనేజర్ల భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ నూతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆన్‌లైన్ భద్రతా ప్రమాణాలను నిర్దేశించుకోవడానికి ఈ 'పేరెంటల్ కంట్రోల్స్' దోహదపడతాయని మెటా యాజమాన్యంలోని వాట్సాప్ బుధవారం వెల్లడించింది. అయితే, ఈ ఫీచర్లు పూర్తిగా ఐచ్ఛికమేనని, వినియోగదారుల వ్యక్తిగత సంభాషణలకు ఎప్పటిలాగే పూర్తి స్థాయి భద్రత ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

ఈ నూతన సదుపాయాల ద్వారా టీనేజర్ల ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడాలి, వారిని గ్రూపుల్లో ఎవరు చేర్చుకోవాలి వంటి అంశాలను తల్లిదండ్రులు పర్యవేక్షించవచ్చు. ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేయాలంటే తల్లిదండ్రులు నిర్దేశించిన 'పిన్' తప్పనిసరి. అంతేకాకుండా, పిల్లలు కొత్త గ్రూపులో చేరినా లేదా వాటి నుంచి వైదొలిగినా తల్లిదండ్రులకు తక్షణ సమాచారం (అలర్ట్స్) అందుతుంది. ఛానెల్స్, స్టేటస్ అప్‌డేట్స్ వినియోగంపై కూడా పరిమితులు విధించుకోవచ్చు. వీటితో పాటు మెటా ఏఐ "లిమిటెడ్ కంటెంట్" ఆప్షన్‌ను ఎంచుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించారు.

ఈ నియంత్రణలు అమలులో ఉన్నప్పటికీ, టీనేజర్ల వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్‌ గోప్యతకు ఎటువంటి భంగం కలగదని వాట్సాప్ భరోసా ఇచ్చింది. అవి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ విధానంలోనే ఉంటాయని, తల్లిదండ్రులు లేదా వాట్సాప్ సంస్థ వాటిని చదవడం లేదా వినడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ ఫీచర్ల ప్రధాన ఉద్దేశం నిఘా పెట్టడం కాదని, ఆన్‌లైన్ భద్రతపై కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన చర్చను ప్రోత్సహించడమేనని కంపెనీ వివరించింది. ఈ ఫీచర్ల లభ్యత ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
Advertisement
WhatsApp
Parental Controls
Teenager Safety
Meta AI
Online Privacy
Digital Safety

More Telugu News