తిరుపతి నుంచి వారణాసికి 25 బైక్‌లు.. టీడీపీ నేతల సేవా సంకల్ప యాత్ర!
Advertisement

తిరుపతి నుంచి వారణాసికి 25 బైక్‌లు.. టీడీపీ నేతల సేవా సంకల్ప యాత్ర!

Narendra Modi 25 years public service TDP Seva Sankalpa Yatra from Tirupati to Varanasi
  • సేవా సంకల్ప యాత్రను ప్రారంభించిన పల్లా శ్రీనివాసరావు
  • తిరుపతి నుంచి వారణాసి వరకు బైక్‌ యాత్ర
  • యాత్రలో పాల్గొంటున్న 25 మంది రైడర్లు
  • టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో యాత్ర నిర్వహణ
  • నాలుగు రాష్ట్రాల మీదుగా ఎనిమిది రోజుల ప్రయాణం
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప యాత్ర’ను ఆయన ప్రారంభించారు. 25 మంది బైక్‌ రైడర్లు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాలు, మంత్రి నారా లోకేశ్‌ సూచనల మేరకు టీడీపీ విద్యార్థి విభాగం (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.

తిరుపతిలోని అలిపిరి నుంచి శ్రీవారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ యాత్ర.. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మీదుగా సాగనుంది. సుమారు ఎనిమిది రోజుల పాటు కొనసాగి అక్టోబర్‌ 8న వారణాసికి చేరుకోనుంది. ఆయా రాష్ట్రాల్లో భాజపా నాయకులు యాత్రకు స్వాగతం పలకనున్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు, యువ నేతలు కూడా ఇందులో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో నిబద్ధతతో పనిచేసే నాయకత్వానికి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు నిదర్శనమని అన్నారు. సమాజ నిర్మాణం, ప్రజా సేవ కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు.

అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేస్తున్నామని పల్లా తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యమని చెప్పారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను గుర్తిస్తూ నిర్వహిస్తున్న ఈ యాత్రలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. యాత్రలో పాల్గొంటున్న బైక్‌ రైడర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Narendra Modi
Palla Srinivasa Rao
TDP Seva Sankalpa Yatra
Tirupati to Varanasi Bike Rally
TNSF
Chandrababu Naidu

More Telugu News