తిరుపతి ఎయిర్‌పోర్ట్ ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తిరుపతి ఎయిర్‌పోర్ట్ ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Center gives green signal for Tirupati Airport privatization
  • 11 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
  • తమిళనాడులోని తిరుచ్చితో తిరుపతి ఎయిర్‌పోర్ట్ బండ్లింగ్
  • పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు నిర్వహణ బాధ్యతలు
 దేశంలోని 11 విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయాన్ని తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంతో కలిపి (బండ్లింగ్) ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) జారీ చేసింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి, ఆధునికీకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి.

ఈసారి కేంద్రం తొలిసారిగా బండ్లింగ్ విధానాన్ని అనుసరిస్తోంది. వాణిజ్యపరంగా లాభదాయకతను పెంచేందుకు, తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని, రద్దీగా ఉండే విమానాశ్రయంతో జత చేస్తున్నారు. ఈ 11 విమానాశ్రయాల అభివృద్ధికి ప్రైవేటు సంస్థల నుంచి సుమారు రూ. 8,622 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విమానాశ్రయాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, నాన్-ఏరోనాటికల్ ఆదాయాన్ని (రిటైల్, కార్గో) పెంచడం దీని ముఖ్య ఉద్దేశం.

తిరుమల యాత్రికులు, పర్యాటకుల రాకపోకలతో తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు రోజువారీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగాక రాజమండ్రి, కడప విమానాశ్రయాలను కూడా ఇదే తరహాలో ప్రైవేటీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

లీజు ఒప్పందంలో భాగంగా, ప్రైవేటు సంస్థలు మొదటి మూడేళ్లపాటు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ సిబ్బందిలో 60 శాతం మందిని కొనసాగించాల్సి ఉంటుంది. విమానాశ్రయాల యాజమాన్యం AAI వద్దే ఉండగా, నిర్వహణ బాధ్యతలు మాత్రమే ప్రైవేటు సంస్థలకు బదిలీ అవుతాయి. ఈ ప్రక్రియ ఇప్పుడు బిడ్డింగ్ దశకు చేరుకుంది.
Advertisement
Tirupati Airport
Airport Privatization
Trichy International Airport
Airports Authority of India
Public Private Partnership
Andhra Pradesh Aviation

More Telugu News