ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్.. ఫోన్‌లో చెప్పి మాయమైన ప్రియుడు

ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్.. ఫోన్‌లో చెప్పి మాయమైన ప్రియుడు

Nidhi Tiwari influencer hangs herself from fan boyfriend disappears after informing on phone
  • మధ్యప్రదేశ్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
  • 16 లక్షల ఫాలోవర్లు ఉన్న నిధి తివారీ బలవన్మరణం
  • కుటుంబానికి సమాచారమిచ్చి అదృశ్యమైన ప్రియుడు సోనూ సింగ్
లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ (30) ఆత్మహత్య చేసుకున్నారు.మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన ప్రియుడు సోనూ సింగ్.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.

సింగ్రౌలి జిల్లా భూసా మోడ్ ప్రాంతంలో నిధి తన తల్లి, చెల్లెలితో కలిసి నివసిస్తున్నారు. శనివారం రాత్రి పూజ ముగించుకుని పైఅంతస్తులో ఉన్న తన గదికి వెళ్లారు. ఆ సమయంలో బ్లూటూత్ ఇయర్‌పీస్ పెట్టుకుని పంజాబ్‌కు చెందిన ఇంజనీర్ సోనూ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే సోనూ.. నిధి తల్లికి ఫోన్ చేసి, "నిధి ఆత్మహత్య చేసుకుంటోంది, వెంటనే పైకి వెళ్లండి" అని చెప్పాడు. కుటుంబ సభ్యులు పైకి పరుగెత్తగా గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపులు పగలగొట్టి చూడగా, ఆమె దుపట్టాతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వారణాసికి చెందిన నిధి తివారీ డ్యాన్స్ రీల్స్‌తో సోషల్ మీడియాలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమెకు ఫేస్‌బుక్‌లో 9.28 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 7.12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2024లో 'మిస్ ప్రిటీ ఇండియా' టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. మోడలింగ్, సినిమాల్లో రాణించాలని ఆమె కలలు కనేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సోనూ సింగ్ తన కుమార్తెను నిరంతరం వేధించేవాడని నిధి తల్లి హేమలతా తివారీ ఆరోపించారు. అతడికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ విషయం తెలిశాక నిధి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని తెలిపారు. మరణానికి ముందు ఆమె "లవ్ యువర్‌సెల్ఫ్" అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి సోనూ సింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సోనూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Nidhi Tiwari
Social Media Influencer
Nidhi Tiwari Suicide
Sonu Singh
Singrauli Madhya Pradesh
Miss Pretty India 2024

More Telugu News