బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. ఏపీలో మారిన పింఛన్ల పంపిణీ షెడ్యూల్

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. ఏపీలో మారిన పింఛన్ల పంపిణీ షెడ్యూల్

AP Pension Distribution Schedule Changed Due to Bank Strike
  • అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
  • బ్యాంకుల సెలవులు, సమ్మె కారణంగా మారిన షెడ్యూల్
  • ఉదయం నగదు డ్రా చేసి మధ్యాహ్నం నుంచి పంపిణీకి ఏర్పాట్లు
  • పింఛన్ల కోసం రూ.2,692 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో అక్టోబర్ నెలకు సంబంధించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ సమయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రతి నెలా 1వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే పింఛన్ల పంపిణీ, ఈసారి మాత్రం మధ్యాహ్నం నుంచి మొదలుకానుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

ఈ నెల చివరి వారంలో బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సెప్టెంబర్ 26న బ్యాంకులకు సెలవు కాగా, 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బ్యాంకులకు వెళ్లి పింఛన్లకు అవసరమైన నగదును విత్‌డ్రా చేస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు.

అక్టోబర్ నెలకు గాను రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692 కోట్లను విడుదల చేసింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఇదిలా ఉంటే.. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ) కింద కేంద్రం ఇచ్చే నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పైలట్ ప్రాజెక్టును తొలుత విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9.34 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకంతో అనుసంధానమై ఉన్నారు.
Advertisement
NTR Bharosa
Andhra Pradesh Pension
Bank Strike Effect
Kondapalli Srinivas
October Pension Schedule
AP Government

More Telugu News