జడ్జీలకు దురుద్దేశాలా?.. న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం

జడ్జీలకు దురుద్దేశాలా?.. న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం

AP High Court Questions Advocate Over Court Videos on Social Media
  • కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై హైకోర్టు అసహనం
  • జడ శ్రావణ్‌కుమార్‌ తీరుపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం
  • న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సూచన
  • క్షమాపణ చెప్పిన న్యాయవాది.. విచారణ ఈ నెల 30కి వాయిదా
కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఒక రహదారిపై విగ్రహాల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 23న జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో, కోర్టు విచారణల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.  

న్యాయవాదులకు చెల్లించే వృత్తిపరమైన ఫీజుల విషయంలో ఇప్పటికే స్పష్టమైన తీర్పులు ఉన్నాయని, వాటిని అధ్యయనం చేసి కోర్టు ముందు ఉంచమని అడగటంలో దురుద్దేశం ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. 

దీనిపై స్పందించిన శ్రావణ్ కుమార్, గత విచారణలో తనకు తగినంత సమయం ఇవ్వలేదని చెప్పడమే తన ఉద్దేశమని తెలిపారు. తీర్పుల కాపీల కోసం సుదీర్ఘ వాయిదా ఇవ్వడం సరికాదని భావించానని వివరించారు. ధర్మాసనంపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయలేదని, తన చర్యలకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. అయితే, ఆయన వివరణను అంగీకరించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.

వివాదానికి నేపథ్యం ఇదే

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం చెల్లించిన ఫీజులపై రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు వేసిన పిల్ విచారణ సందర్భంగా ఈ వివాదం మొదలైంది. జూన్ 2024 నుంచి జూన్ 2026 మధ్య సిద్ధార్థ్ లూథ్రాకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రూ. 15.80 కోట్లు చెల్లించిందని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణ సమయంలో, ఎందరో సీనియర్ న్యాయవాదులు ప్రభుత్వాల నుంచి ఫీజులు తీసుకుంటుంటే ఒక్క లూథ్రాను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని, గత చెల్లింపులను ఎందుకు ప్రశ్నించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై ఉన్న పూర్వ తీర్పులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ విచారణపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రావణ్ కుమార్ ఒక వీడియోను విడుదల చేయడంతో తాజా వివాదం మొదలైంది.

కోర్టు విచారణల వీడియోలను సందర్భం లేకుండా సర్క్యులేట్ చేయడంపై సుప్రీంకోర్టు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Jada Sravan Kumar
Andhra Pradesh High Court
Chief Justice Lisa Gill
Court Proceedings Recording
Social Media Legal Video
Advocate Ethics

More Telugu News