యూకేలో అజిత్‌ను సీఎం విజయ్ కలవడంపై విమర్శలు.. ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..!

యూకేలో అజిత్‌ను సీఎం విజయ్ కలవడంపై విమర్శలు.. ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..!

CM Vijay meeting Ajith in UK Prakash Raj reacts to criticism
  • విదేశీ పర్యటన వివాదంపై సీఎం విజయ్‌కు ప్రకాశ్ రాజ్ మద్దతు
  • స్నేహితుడు అజిత్‌ను కలవడంలో ఎలాంటి తప్పులేదని వ్యాఖ్య
  • టీవీకే ప్రభుత్వంపై విమర్శలకు తొందరపడొద్దని హితవు
  • ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందన్న ప్రకాశ్ రాజ్
  • ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును గౌరవించాలని సూచన
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆయనకు అండగా నిలిచారు. విజయ్ ప్రభుత్వం ఏర్పడి కొద్ది నెలలే అయిందని, వారి పనితీరును అంచనా వేయడానికి లేదా విమర్శించడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుచిరాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్ తన యూకే పర్యటనలో భాగంగా స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్‌ను కలవడాన్ని కొందరు తప్పుబడుతున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఒక ముఖ్యమంత్రి తన స్నేహితుడిని విదేశాల్లో కలిస్తే అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఏ ఉద్దేశంతో పర్యటనకు వెళ్లారో అది నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పర్యటన ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు విజయ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ మాట నెరవేరితే పర్యటన విజయవంతమైనట్టేనని పరోక్షంగా సూచించారు.

టీవీకే ప్రభుత్వం ఏర్పడి కేవలం 120 రోజులు మాత్రమే అవుతోందని, అప్పుడే వారి పరిపాలనపై ఒక అంచనాకు రావడం సరికాదని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఏ కొత్త ప్రభుత్వానికైనా వారి విధానాలను అమలు చేయడానికి, ఫలితాలు చూపించడానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని ఆయన సూచించారు. తాను తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వేచి చూస్తానని, ఆ తర్వాతే ప్రభుత్వ పనితీరుపై స్పందిస్తానని తెలిపారు.

ఎన్నికలకు ముందు తనకు కూడా విజయ్‌పై కొన్ని సందేహాలు ఉన్నాయని, ఆ విషయాన్ని తాను బహిరంగంగానే చెప్పానని ప్రకాశ్ రాజ్ అంగీకరించారు. అయినప్పటికీ, ప్రజలు టీవీకేకు ఓటు వేసి గెలిపించారని, ఆ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని అన్నారు. అధికారంలో ఉన్నవారు మనకు నచ్చనంత మాత్రాన వెంటనే వారిపై విమర్శలు గుప్పించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన హితవు పలికారు.

ఇటీవల సీఎం విజయ్ ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన లే మాన్స్ కప్ రేసుకు హాజయ్యారు. అక్కడ తన స్నేహితుడు హీరో అజిత్ పోటీ పడుతుండటంతో ఆయనకు మద్దతు తెలిపారు. ఈ పర్యటనలో నటి త్రిష, మంత్రి ఆధవ్ అర్జున కూడా ఉన్నారు. అయితే ఈ పర్యటన ఉద్దేశం, ప్రభుత్వ ఖర్చుపై పారదర్శకత లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Advertisement
CM Vijay
Prakash Raj
Ajith Kumar
UK visit
Tamil Nadu politics
TVK party

More Telugu News