ఇప్పుడు మరో చక్కటి నగరాన్ని నిర్మించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు: బెంగళూరులో చంద్రబాబు

ఇప్పుడు మరో చక్కటి నగరాన్ని నిర్మించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు: బెంగళూరులో చంద్రబాబు

Chandrababu Naidu says God gave me the opportunity to build another beautiful city in Bengaluru
  • బెంగళూరులో 'ది ఎర్త్ సెంటర్' ప్రారంభోత్సవం 
  • కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు వెళ్లాలని పిలుపు
  • అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ ముఖ్యమేనన్న సీఎం
  • పర్యావరణ హిత నగరంగా అమరావతి నిర్మాణం చేపడతామని వెల్లడి
బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో ఆదివారం జరిగిన 'ది ఎర్త్ సెంటర్ - విష్టా స్పేసెస్' ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు అమరావతి రూపంలో మరో చక్కటి నగరాన్ని నిర్మించే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు" అని అన్నారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక మౌలిక వసతులతో అమరావతిని భవిష్యత్ తరాలకు అనువైన, పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు పయనం

ప్రపంచం ఇప్పుడు 'గ్రే గ్రోత్' నుంచి 'గ్రీన్ గ్రోత్' వైపు దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైందని చంద్రబాబు పిలుపునిచ్చారు. "కాంక్రీట్ జంగిల్స్ నుంచి పర్యావరణ హిత నిర్మాణాల గురించి అందరూ ఆలోచించాలి. అభివృద్ధి ఆగకూడదు, అదే సమయంలో పర్యావరణానికి గాయం చేయకూడదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి" అని ఆయన సూచించారు. 

దశాబ్దాలుగా నగరాల విస్తరణ 'గ్రే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' ఆధారంగా జరిగిందని, ఇప్పుడు గ్రీన్ గ్రోత్, సర్క్యులర్ గ్రోత్, రీజెనరేటివ్ గ్రోత్ వంటి విధానాలు అత్యవసరమని పేర్కొన్నారు. వనరులను అధికంగా వాడే భవనాలు కాకుండా, తెలివిగా వినియోగించుకునే నిర్మాణాలను చేపట్టాలని ఉద్బోధించారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకునే 'ది ఎర్త్ సెంటర్' నిర్మాణం జరిగిందని, ఇలాంటి భవనాలకే భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు ప్రశంసించారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ, రీ-సైకిల్ చేసిన టెర్రకోట వంటి పదార్థాలతో ఈ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

వాతావరణ మార్పులనేవి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే మన ముందున్న పెను సవాలని చంద్రబాబు హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు. భవన నిర్మాణాల్లో 'నెట్ జీరో' విధానాన్ని పాటించాలని, సోలార్ విద్యుత్ వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

"ప్రతి ఇంటి పైకప్పు ఒక పవర్ ప్లాంట్‌గా మారవచ్చు. ప్రతి నీటి చుక్కను తిరిగి వినియోగించవచ్చు. ప్రతి వ్యర్థాన్ని ఒక వనరుగా మార్చవచ్చు. నీటిని, నేలను కాపాడటమంటే సంపదను సృష్టించడమే" అని ఆయన వివరించారు. చెత్తను కంపోస్టుగా మార్చుకోవడం, రీ-యూజ్ విధానాన్ని అవలంబించడం ద్వారానే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కర్ణాటక, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని అన్నారు.

అమరావతి - ఒక పర్యావరణ హిత నగరం

వ్యవసాయంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నామని, పట్టణాభివృద్ధిలోనూ అదే స్ఫూర్తి అవసరమని చంద్రబాబు అన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలనే జాతీయ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. ఏపీలో సుమారు 165 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రణాళిక చేస్తున్నామని వెల్లడించారు. ఈ స్ఫూర్తితోనే అమరావతిని పూర్తి పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని పునరుద్ఘాటించారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తూ ఈ అద్భుత ప్రాజెక్టును రూపొందించిన విస్టా స్పేసెస్ బృందాన్ని, వెంకటరమణన్ అసోసియేట్స్ ప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
Chandrababu Naidu
Amaravati Green City
The Earth Center Bengaluru
DK Shivakumar
Sustainable Urban Development
Andhra Pradesh Green Growth

More Telugu News