భూలావాదేవీలు ఉన్నవారే పార్టీ మారారు: మేనల్లుడు టీడీపీలో చేరిన సందర్భంగా బొత్స సత్యనారాయణ
- ఇటీవలే టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను
- స్వార్థపూరిత రాజకీయాలు చేసేవారు పార్టీకి అవసరం లేదన్న బొత్స
- నిబద్ధత కలిగిన కార్యకర్తలే వైసీపీకి అసలైన బలం అని వ్యాఖ్య
పదవులు, భూ లావాదేవీలు, సొంత వ్యాపార ప్రయోజనాలలో మునిగితేలిన నాయకులే ఈ రోజు వైసీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బొత్స మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
సమాజంలో గౌరవంగా ఉన్న ఏ ఒక్క నీతివంతమైన కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడటం లేదని బొత్స అన్నారు. స్వార్థపూరిత లాలూచీ రాజకీయం చేసే వ్యక్తులు పార్టీకి అవసరం లేదని... ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే గౌరవప్రదమైన కుటుంబాలు, నిబద్ధత కలిగిన కార్యకర్తలే వైసీపీకి అసలైన బలం అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభావాన్ని అడ్డుపెట్టుకుని భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడిపిన వారే ఇప్పుడు స్వలాభం కోసం జంప్ అయ్యారని మండిపడ్డారు.
రాజకీయాల్లో హెచ్చుతగ్గులు సహజమని, స్వార్థపరులు వీడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగకపోగా, మరింత ప్రక్షాళన జరిగి నిజమైన నాయకత్వంతో బలోపేతమవుతుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి సాధారణ కార్యకర్తకు, నాయకుడికి తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాబోయే రోజుల్లో వైసీపీ మళ్లీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తల కష్టాన్ని వృథా పోనివ్వమని, అందరినీ కలుపుకుని మళ్లీ ప్రజాదరణ పొందుతామని పిలుపునిచ్చారు.