టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఈడీ

టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఈడీ

TTD Ghee Adulteration Case ED Arrests Another Key Accused
  • టీటీడీ నెయ్యి కల్తీ కేసులో మరో కీలక అరెస్ట్
  • సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను అదుపులోకి తీసుకున్న ఈడీ
  • రూ. 230 కోట్ల మేర కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు గుర్తింపు
  • పామాయిల్, రసాయనాలతో నెయ్యి తయారు చేసి మోసం చేసినట్టు ఆరోపణ
  • ఇప్పటికే ఇదే కేసులో ప్రధాన నిందితుడు విపిన్ జైన్ అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను హైదరాబాద్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం విశాఖపట్నంలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో భారీస్థాయిలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. పామాయిల్, పామోలిన్, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసిన నకిలీ నెయ్యిని, "అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి"గా నమ్మబలుకుతూ టీటీడీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు రూ. 230 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని నిందితులు సరఫరా చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ. 96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని కైలాష్ చంద్ మంగ్లా తన ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఈ కుంభకోణంలో కైలాష్ చంద్ సహ కుట్రదారుడిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మల్‌గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి సంస్థల పేర్లతో ఆయన కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు గుర్తించారు. కల్తీని కప్పిపుచ్చేందుకు, అసలైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసినట్లుగా తప్పుడు రికార్డులను సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. ఇదే కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న విపిన్ జైన్‌ను ఈడీ అధికారులు గతంలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Kailash Chand Mangla
TTD Ghee Adulteration Case
Enforcement Directorate ED
Sukriti Foods Private Limited

More Telugu News