ఆంక్షలు అమెరికాకు వర్తించవా మరి? రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేస్తున్న అగ్రరాజ్యం!

ఆంక్షలు అమెరికాకు వర్తించవా మరి? రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేస్తున్న అగ్రరాజ్యం!

USA buys Uranium from Russia while imposing sanctions on others
  • రష్యా చమురు కొనే దేశాలపై 100 శాతం సుంకాలకు అమెరికాలో బిల్లుకు ఆమోదం
  • అదే సమయంలో రష్యా నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటున్న అగ్రరాజ్యం
  • అమెరికా అణు విద్యుత్‌ రంగానికి రష్యా యురేనియమే కీలకం
  • యురేనియం దిగుమతులపై మాత్రం పరిమిత స్థాయి ఆంక్షలు విధించిన అమెరికా
రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కొత్త చట్టానికి మార్గం సుగమం చేసింది. ‘లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌-2026’కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఇంధనం కొనుగోలు చేసే భారత్‌, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌ విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు దక్కనుంది. అయితే ఇది ఆటోమేటిక్‌గా అమలయ్యే టారిఫ్‌ కాదు. ట్రంప్‌ ఆ అధికారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. 

ఇదే సమయంలో రష్యా నుంచి వచ్చే అణు ఇంధనంపై మాత్రం అమెరికా పూర్తిగా తలుపులు మూయలేదు. ముఖ్యంగా రష్యా నుంచి లభించే తక్కువ సాంద్రత యురేనియం (LEU) విషయంలో పరిమిత మినహాయింపులు కొనసాగుతున్నాయి. అమెరికా అణు విద్యుత్‌ రంగానికి రష్యా ఇంధన సరఫరా ఇప్పటికీ కీలకంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

2024లో అమెరికా రష్యన్‌ యురేనియం దిగుమతులపై ఆంక్షలు విధించింది. అయితే దేశీయ అణు రియాక్టర్లకు ప్రత్యామ్నాయం దొరకని పరిస్థితుల్లో లేదా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే దిగుమతులకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంచింది. ఈ మినహాయింపులు 2028 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగుతాయి.

అమెరికా అణు రంగానికి రష్యా యురేనియం ఎంత ముఖ్యమో తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2025లో అమెరికా పౌర అణు విద్యుత్‌ రియాక్టర్ల నిర్వాహకులు కొనుగోలు చేసిన ఎన్‌రిచ్‌మెంట్‌ సేవల్లో రష్యా వాటా 26 శాతంగా ఉంది. అమెరికా వాటా 23 శాతం కాగా.. ఫ్రాన్స్‌ 18 శాతం, బ్రిటన్‌ 14 శాతం, నెదర్లాండ్స్‌ 8 శాతం అందించాయి. 

అందుకే రష్యాతో అణు ఇంధన సంబంధాలను ఒక్కసారిగా తెంచుకోవడం అమెరికాకు అంత సులభం కాదు. ఒకవైపు రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచుతూనే.. మరోవైపు తమ అణు విద్యుత్‌ వ్యవస్థకు ఇంధన కొరత రాకుండా అమెరికా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తోంది.

ఇదే సమయంలో భారత్‌పై మాత్రం రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. కొత్త చట్టం కింద ట్రంప్‌ 100 శాతం వరకు టారిఫ్‌ విధించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అలాంటి కొత్త 100 శాతం సుంకం భారత్‌పై విధించలేదు.
Advertisement
Donald Trump
USA Russia Sanctions
Russian Uranium Imports
India Russia Oil Trade
Lindsey O Graham Act
US Energy Tariffs

More Telugu News