22ఏ భూముల సమస్య తీవ్ర రూపం దాల్చింది: రఘునందన్ రావు
- లక్షలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది పడుతున్నారన్న రఘునందన్ రావు
- అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సమాధానం దాటవేశారని విమర్శ
- కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లే రాజకీయాలు చేస్తోందని మండిపాటు
తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్య తీవ్ర రూపం దాల్చిందని, దీనివల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూములపై స్పష్టమైన చారిత్రాత్మక నిర్ణయం వస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ అంశంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనీస సన్నాహాలు లేకుండా సభకు వచ్చి అరకొర సమాచారంతో సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కోటి ఎకరాలకు పైగా భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో చేర్చిన అధికారులపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి ప్రతిపాదిస్తున్నట్లు, ఇప్పటివరకు తొలగించామంటున్న 47,440 ఎకరాల వివరాలు ఏ గ్రామంలో ఎక్కడున్నాయో బహిర్గతం చేయాలని, మిగిలిన భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడిన ప్రత్యేక కమిటీని నియమించి ధరణి, భూభారతి లొసుగుల వల్ల నష్టపోయిన పేదలకు న్యాయం చేయాలని రఘునందన్ రావు కోరారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ రేవంత్ సర్కార్ బురదజల్లే రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి కేబినెట్ సమావేశంలోనే భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎంపీ స్పష్టం చేశారు.