‘నెమ్మదిగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు తెరతీశారు’.. మోదీ సర్కార్‌పై రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు

‘నెమ్మదిగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు తెరతీశారు’.. మోదీ సర్కార్‌పై రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు

Rahul Gandhi makes serious allegations against Modi government over UPI transaction charges
  • రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీకి అవకాశం ఉందని రాహుల్‌ ఆరోపణ
  • రూ.2,000 వరకు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవని కేంద్రం స్పష్టీకరణ
  • అంతకుమించిన లావాదేవీల విషయంలో స్పష్టంగా చెప్పని కేంద్రం
  • ఎండీఆర్‌ భారం చివరకు వినియోగదారులపైనే పడొచ్చన్న రాహుల్‌ గాంధీ
  • జీరో-ఎండీఆర్‌ విధానాన్ని మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపణ
యూపీఐపై ఛార్జీల విధింపునకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధించే అవకాశం కల్పించారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘యూపీఐపై ఛార్జీలు విధించేందుకు మోదీ ప్రభుత్వం నిశ్శబ్దంగా తలుపులు తెరిచింది. రూ.2,000కు మించిన యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఇప్పుడు ఎండీఆర్‌ విధించవచ్చు’’ అని రాహుల్‌గాంధీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఇలాంటి లావాదేవీలు మొత్తం యూపీఐ లావాదేవీల్లో పరిమాణం పరంగా ఐదు శాతం మాత్రమే ఉన్నా.. మొత్తం లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు.

రూ.2,000 వరకు మాత్రమే ఛార్జీలు ఉండవా?
బ్యాంకులు, పేమెంట్‌ వ్యవస్థల సంస్థలు రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై, రూపే డెబిట్‌ కార్డు చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. అయితే రూ.2,000కు మించిన లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఛార్జీలు తీసుకోవచ్చా లేదా అన్న విషయాన్ని తాజా ఆదేశాల్లో స్పష్టంగా చెప్పలేదు.

ఇప్పటివరకు లావాదేవీల మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐపై ఎలాంటి ఛార్జీ లేదు. దీంతో కొత్త నిబంధనలపై రాజకీయ చర్చ మొదలైంది.

చివరకు భారం వినియోగదారులపైనేనా?
వ్యాపారులపై ఎండీఆర్‌ విధించినా ఆ భారాన్ని చివరకు వినియోగదారులే భరించాల్సి వస్తుందని రాహుల్‌గాంధీ అన్నారు. వ్యాపారులు ఆ అదనపు ఖర్చును వస్తువుల ధరల్లో కలిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా చెల్లింపు సంస్థలు చాలాకాలంగా భారత్‌లో అమల్లో ఉన్న జీరో-ఎండీఆర్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పుడు అదే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూడా కేంద్రంపై మండిపడ్డారు. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం.. వారి జేబులపై మరో భారం మోపే మార్గాన్ని వెతుకుతోందని విమర్శించారు.

ఎందుకు ఎండీఆర్‌?
యూపీఐ లావాదేవీలు భారీగా పెరగడంతో సైబర్‌ భద్రత, మోసాల నివారణ, డిజిటల్‌ మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం పెద్ద మొత్తంలో ఖర్చు అవుతోందని కేంద్రం చెబుతోంది. ఈ వ్యవస్థను దీర్ఘకాలంలో స్వయం సమృద్ధిగా కొనసాగించేందుకు ఛార్జీల విధింపు అవసరమని పేర్కొంది.

మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి వచ్చి పోటీ పెంచాలన్నా స్థిరమైన ఆదాయ నమూనా అవసరమని కేంద్రం తెలిపింది. సబ్సిడీలపైనే ఆధారపడటం ద్వారా యూపీఐ తదుపరి దశ వృద్ధిని కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఎండీఆర్‌ రేట్లను నిర్ణయించే బాధ్యతను ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోని యూపీఐ, సర్వీసెస్‌ స్టీరింగ్‌ కమిటీకి అప్పగించే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వస్తాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
Advertisement
Rahul Gandhi
UPI transaction charges
Narendra Modi
Merchant Discount Rate MDR
UPI payments above 2000
Digital payment policy India

More Telugu News