చిన్న శ్రీను రాకతో ఉత్తరాంధ్రలో టీడీపీ మరింత బలపడింది: మంత్రి కొండపల్లి
- ఇటీవల టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను
- మంత్రి కొండపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీను
- స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానన్న శ్రీను
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేరికతో ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరిందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కొండపల్లిని మజ్జి శ్రీనివాసరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ, స్థానికంగా పార్టీని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆయా నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు, ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కూటమి భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే ప్రతి కేడర్‌ను భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, విజయనగరం జిల్లాలో 100 శాతం స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర కూటమి పెద్దల ఆశీస్సులు తీసుకున్నానని... తనతో వచ్చే శ్రేణులను కలుపుకొని కూటమి నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.