భారత పౌరసత్వంపై గ్రోక్ సమాధానం.. ఎలాన్ మస్క్ వైరల్ కామెంట్

భారత పౌరసత్వంపై గ్రోక్ సమాధానం.. ఎలాన్ మస్క్ వైరల్ కామెంట్

Grok response on Indian citizenship Elon Musk viral comment
  • భారత్‌లో స్థిరపడాలనుకున్న ఐర్లాండ్ వ్యక్తికి గ్రోక్ ఏఐ సమాధానం
  • పౌరసత్వానికి 12  ఏళ్ల నివాసం తప్పనిసరి అని వెల్లడి
  • ఈ సంభాషణపై 'ఇండియా ఈజ్ రియలిస్టిక్' అని స్పందించిన ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రోక్' మరోసారి వార్తల్లో నిలిచింది. భారత్‌లో స్థిరపడాలనుకుంటున్న ఐర్లాండ్ పౌరుడొకరు అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన సమాధానం, దానికి ఎలాన్ మస్క్ జోడించిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఐర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తి తన భాగస్వామి, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారు. తాను భారత్‌లోనే శాశ్వతంగా స్థిరపడాలని భావిస్తున్నట్లు పేర్కొంటూ, భారత పౌరసత్వం పొందడానికి పట్టే సమయం గురించి ఆయన గ్రోక్‌ను ప్రశ్నించారు.

దీనికి గ్రోక్ స్పందిస్తూ.. భారత సహజ పౌరసత్వం పొందాలంటే కనీసం 12 ఏళ్లపాటు ఇక్కడ చట్టబద్ధంగా నివసించాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేయడానికి ముందు గడిచిన 14 ఏళ్లలో 11 ఏళ్ల పాటు భారత్‌లో ఉండాలని, దరఖాస్తుకు ముందు చివరి ఏడాది మాత్రం నిరంతరంగా దేశంలోనే నివసించాలనే నిబంధన ఉందని వివరించింది. అంతేకాకుండా, భారత్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని, భారత పౌరసత్వం కావాలంటే ఐర్లాండ్ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. పౌరసత్వం మంజూరు అనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని కూడా పేర్కొంది.

ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను పీటర్ సెయింట్ ఓంజ్ అనే ఎక్స్ వినియోగదారుడు పంచుకోగా, దానిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. “India is realistic” (భారత్ వాస్తవిక దృక్పథంతో ఉంది) అని వ్యాఖ్యానించారు. మస్క్ చేసిన ఈ చిన్న వ్యాఖ్య నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. మస్క్ వ్యాఖ్యలతో నెటిజన్లు ఏకీభవిస్తూ.. "భారత్ ఎప్పటి నుంచో వాస్తవికంగానే ఉంది", "భారత్ ఒక అద్భుతమైన దేశం" అంటూ కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు.
Advertisement
Elon Musk
Grok AI
Indian Citizenship
India is realistic
Indian Citizenship Rules
Grok AI Indian Citizenship

More Telugu News