ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సీఎం చంద్రబాబు.. విజయసాయిరెడ్డి స్పందన

ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సీఎం చంద్రబాబు.. విజయసాయిరెడ్డి స్పందన

CM Chandrababu Urges More Children Vijayasai Reddy Responds
  • ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై విజయసాయిరెడ్డి విమర్శ
  • ఒక్కరే బిడ్డ ఉన్న చంద్రబాబు ఈ పిలుపునివ్వడం హాస్యాస్పదమని వ్యాఖ్య
  • పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులు, సౌకర్యాలపైనే కుటుంబాలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టీకరణ
  • విజ్ఞప్తులు చేయడం కాకుండా, పిల్లల పెంపకాన్ని సులభతరం చేయాలని ప్రభుత్వానికి సూచన
రాష్ట్రంలో యువత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. కేవలం ముఖ్యమంత్రి పిలుపునిచ్చినంత మాత్రాన ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనరని, అందుకు అనువైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన హితవు పలికారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లోని వైరుధ్యాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. "ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకే సంతానం, ఆయన కుమారుడికి కూడా ఒకే సంతానం. అలాంటప్పుడు ఇతరులను ఎక్కువ మంది పిల్లల్ని కనమని కోరడం హాస్యాస్పదంగా ఉంది" అని ఆయన విమర్శించారు. ప్రజలు పిల్లల్ని కనాలనే నిర్ణయాన్ని సీఎం విజ్ఞప్తుల ఆధారంగా తీసుకోరని, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటారని స్పష్టం చేశారు.

కుటుంబాలు పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలను విజయసాయిరెడ్డి తన పోస్టులో వివరించారు. "తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం, మంచి నివాసం, సంరక్షణ అందించగలమా లేదా అనే ఆర్థిక స్థోమతను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా, ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోగలమా అన్నది కూడా ఆలోచిస్తారు" అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో జననాల రేటు క్షీణతపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కేవలం విజ్ఞప్తులు చేయడం పరిష్కారం కాదని విజయసాయిరెడ్డి సూచించారు. "పిల్లల పెంపకాన్ని సులభతరం చేసేలా, మరింత అందుబాటులోకి తెచ్చేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టినప్పుడే వారు ఎక్కువ మంది పిల్లల గురించి ఆలోచించగలరు" అని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. 
Advertisement
Chandrababu Naidu
Vijayasai Reddy
Andhra Pradesh
Population Policy
Birth Rate
YSRCP

More Telugu News