2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తెలంగాణ లక్ష్యం: శ్రీధర్ బాబు
- హైదరాబాద్ లో వికేంద్రీకృత నగర పాలనను అందుబాటులోకి తెస్తున్నామన్న శ్రీధర్ బాబు
- దీని కోసమే క్యూర్ యాక్ట్ 2026ను రూపొందించామని వెల్లడి
- హైదరాబాద్ ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ సిటీగా ఎదిగిందన్న మంత్రి
హైదరాబాద్ నగరంలో రాబోయే 20 నుంచి 30 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వికేంద్రీకృత నగర పాలనను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకోసమే ప్రత్యేకంగా ‘క్యూర్ (CURE) యాక్ట్- 2026’ శాసనాన్ని రూపొందించినట్లు శాసనసభలో ఆయన వెల్లడించారు. నగర పరిపాలనను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజా సమన్వయంతో ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పాలసీ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చాటిచెప్పారు.
చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు, మూసీ తీరం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్ ఎదిగిందని మంత్రి కొనియాడారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (GCC) ప్రధాన కేంద్రంగా మారిన హైదరాబాద్... రాష్ట్ర ఆర్థిక రంగానికి ప్రధాన గ్రోత్ ఇంజన్ అని గుర్తుచేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీ 10.7 శాతం వృద్ధితో రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని... ఇందులో క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలే సింహభాగం భాగస్వామ్యం వహిస్తున్నాయని ఆర్థిక గణాంకాలతో వివరించారు.
ప్రస్తుతం నగరం ఔటర్ రింగ్ రోడ్డు వరకు వేగంగా విస్తరించిన నేపథ్యంలో మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఓఆర్‌ఆర్ పరిధికి ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ప్రజా రవాణా, ట్రాఫిక్ నివారణ, చెత్త నిర్వహణ, వరదల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చి నగరపాలనను అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.