యుద్ధంపై భారత ఆర్మీ మాజీ అధికారుల అదిరిపోయే థియరీ.. నాటో అధ్యయనంలో పదే పదే ప్రస్తావన!

యుద్ధంపై భారత ఆర్మీ మాజీ అధికారుల అదిరిపోయే థియరీ.. నాటో అధ్యయనంలో పదే పదే ప్రస్తావన!

Former Indian Army officers war theory gets recognition in NATO study
  • భారత మాజీ ఆర్మీ అధికారుల పేపర్‌కు అంతర్జాతీయ గుర్తింపు
  • నాటో భాగస్వామ్య అధ్యయనంలో 10 సార్లు ప్రస్తావన
  • హుడా, రాజన్‌ కలిసి పరిశోధన పత్రం రూపకల్పన
  • ఆధునిక యుద్ధంలో సమాచార ప్రభావంపై వివరణ
  • ఏఐ, సోషల్‌ మీడియా ముప్పులపై పేపర్‌లో విశ్లేషణ
భారత సైనిక ఆలోచనా విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారత ఆర్మీ మాజీ అధికారులు లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా, లెఫ్టినెంట్‌ కల్నల్‌ పవిత్రన్‌ రాజన్‌ రూపొందించిన పరిశోధన పత్రాన్ని నాటో భాగస్వామ్యంతో వెలువడిన అంతర్జాతీయ అధ్యయనంలో పలుమార్లు ప్రస్తావించారు. ‘హైబ్రిడ్‌ వార్‌: థ్రెట్స్‌ టు పవర్‌ గ్రిడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వచ్చిన ఈ అధ్యయనంలో భారత మాజీ సైనికాధికారుల పత్రాన్ని కనీసం 10 సార్లు ఉటంకించారు.

హుడా, రాజన్‌ కలిసి ‘బియాండ్‌ ది కైనెటిక్‌: డీకన్‌స్ట్రక్టింగ్‌ వార్‌ఫేర్‌ ఇన్‌ ది సోషియో-టెక్నికల్‌-కాగ్నిటివ్‌ బాటిల్‌స్పేస్‌’ పేరుతో పరిశోధన పత్రాన్ని రూపొందించారు. న్యూఢిల్లీలోని కౌన్సిల్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ (సీఎస్‌డీఆర్‌) దీన్ని జనవరి 2026లో ప్రచురించింది.

ఆధునిక యుద్ధం అంటే కేవలం సైన్యం, ఆయుధాలతో చేసే పోరాటం కాదని ఈ పత్రం వివరించింది. ప్రజల్లో సమాచార ప్రవాహం, సోషల్‌ మీడియా, డిజిటల్‌ వేదికలు, కృత్రిమ మేధ వంటి అంశాలు కూడా యుద్ధ ఫలితాలను ప్రభావితం చేయగలవని పేర్కొంది. ప్రజల ఆలోచనలు, నిర్ణయాలను ప్రభావితం చేయడం ద్వారా ప్రత్యర్థి దేశ సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చని వివరించింది.

ఈ అంశాలను నాటోకు అనుబంధంగా వచ్చిన అధ్యయనంలో ‘ఏఐ అండ్‌ కాగ్నిటివ్‌ వార్‌ఫేర్‌’ అధ్యాయంలో విస్తృతంగా ప్రస్తావించారు. ఓఓడీఏ (ఆబ్జర్వ్‌, ఓరియంట్‌, డిసైడ్‌, యాక్ట్‌) విధానాన్ని కూడా ఇందులో చర్చించారు. ప్రత్యర్థి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా ‘కాగ్నిటివ్‌ డామినెన్స్‌’ సాధించవచ్చని పేర్కొన్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో స్టార్‌లింక్‌ వంటి సాంకేతికత వినియోగం, క్లియర్‌వ్యూ ఏఐ ద్వారా రష్యా సైనికులను గుర్తించే ప్రయత్నాలను కూడా ఈ అధ్యయనం ప్రస్తావించింది. విద్యుత్‌ గ్రిడ్‌పై దాడులు, తప్పుడు సమాచారం, మానసిక యుద్ధం, ఏఐ ఆధారిత గందరగోళం వంటి అంశాల్లోనూ హుడా, రాజన్‌ పరిశోధనను ఉటంకించింది.

ఈ అంతర్జాతీయ గుర్తింపుపై మాజీ ఆర్మీ చీఫ్‌, మిజోరం మాజీ గవర్నర్‌ జనరల్‌ వీకే సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. హుడా, రాజన్‌ పరిశోధనకు లభించిన గుర్తింపు భారత వ్యూహాత్మక ఆలోచనా విధానానికి ‘మైలురాయి’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.
Advertisement
DS Hooda
Pavitra Rajan
Hybrid Warfare
NATO Study
Cognitive Warfare
Indian Army Research

More Telugu News