ఓ దేశాధినేత విదేశీ పర్యటనకు వెళ్తే ఆతిథ్య దేశం ప్రత్యేక విందులు సిద్ధం చేస్తుంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విషయంలో మాత్రం వ్యవహారం కాస్త భిన్నమట. ఆయన తినే ఆహారం విషయంలో అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటారని నివేదికలు చెబుతున్నాయి. హోటల్‌లో వండిన ఆహారం కంటే సొంత బృందం సిద్ధం చేసిన భోజనానికే ప్రాధాన్యం ఇస్తారట.

ప్రత్యేక బృందంతోనే ప్రయాణం
18వ బ్రిక్స్‌ సదస్సు కోసం పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఈ సదస్సు జరగనుంది. పుతిన్‌ ఐటీసీ మౌర్యలో బస చేయనున్నట్లు సమాచారం.

విదేశీ పర్యటనల్లో పుతిన్‌ కోసం రష్యా నుంచి ప్రత్యేక వంట బృందం వెంట వస్తుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయనకు వడ్డించే ఆహార పదార్థాలను ముందుగానే క్షుణ్నంగా పరీక్షిస్తారట. ప్రతి వంటకాన్ని పరిశీలించిన తర్వాతే ఆయనకు అందిస్తారని సమాచారం.

హోటల్‌ వంటకాలకు దూరంగా?
ఆతిథ్య దేశంలోని హోటళ్లు సిద్ధం చేసే ఆహారం సాధారణంగా పుతిన్‌ రోజువారీ భోజనంలో భాగం కాదని నివేదికలు చెబుతున్నాయి. ఆయన పర్యటనల కోసం ప్రత్యేక వంటగదులను ఏర్పాటు చేస్తారని సమాచారం. రష్యా నుంచి తీసుకొచ్చిన లేదా ముందుగా పూర్తిగా పరీక్షించిన పదార్థాలతోనే అక్కడ వంట చేస్తారట.

ఆహారంలో ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చూడటమే ఈ కఠిన నిబంధనల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వ విందుల్లోనూ పుతిన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారాన్నే అందించే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

పుతిన్‌ ప్లేట్‌లో ఏముంటుంది?
ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా ఉన్నా.. పుతిన్‌ సాధారణ ఆహారం మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అల్పాహారంలో రష్యన్‌ కాటేజ్‌ చీజ్‌ తరహా ‘ట్వరోగ్‌’, తేనె లేదా గంజి ఉంటాయట. తాజా పండ్ల రసాలు కూడా తీసుకుంటారని సమాచారం. అప్పుడప్పుడు ఆమ్లెట్‌, పచ్చి క్వెయిల్‌ గుడ్లు కూడా ఆయన మెనూలో ఉంటాయట.

చేపలు, మాంసం..
చేపలు పుతిన్‌ ఆహారంలో తరచూ ఉంటాయని చెబుతారు. తాజా లేదా ఎండు చేపలను ఇష్టపడతారట. గొర్రె మాంసం కూడా తీసుకుంటారని సమాచారం. అయితే ఎక్కువ మసాలాలు, కొవ్వుతో కూడిన వంటకాలకు దూరంగా ఉంటారట.

టమాటాలు, దోసకాయల వంటి కూరగాయలతో చేసిన సలాడ్లు ఆయన ఆహారంలో ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. స్వీట్లు, క్రీమ్‌ పేస్ట్రీలు వంటి వాటిని సాధారణంగా తీసుకోరట. పానీయాల్లో తాజా జ్యూస్‌, కేఫీర్‌, హెర్బల్‌ డ్రింక్స్‌కు ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. బీట్‌రూట్‌, హార్స్‌రాడిష్‌తో చేసిన సంప్రదాయ రష్యన్‌ పానీయాలు కూడా ఆయన మెనూలో ఉంటాయని చెబుతున్నారు.

అయితే ఈ క్రమశిక్షణకు ఓ చిన్న మినహాయింపు ఉందట. పిస్తా ఐస్‌క్రీమ్‌ అంటే పుతిన్‌కు ఇష్టమని పలు కథనాల్లో ప్రస్తావించారు.