మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్‌సుఖ్ (58) ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ఓ సైనిక యూనిట్‌ను సందర్శించిన ఆయన, అక్కడున్న సైనికులు, అధికారుల ముందు సూట్‌లోనే 100 కిలోల బరువును బెంచ్‌ప్రెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ సైనిక కార్యక్రమానికి హాజరైన ఖురెల్‌సుఖ్, అక్కడున్న జిమ్‌ పరికరాలను చూసి వర్కౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు. తన సూట్ జాకెట్‌ను తీసి పక్కన పెట్టి, బెంచ్‌పై పడుకుని ఏకధాటిగా 20 సార్లు 100 కిలోల బరువును ఎత్తారు. అధ్యక్షుడి బలం, ఫిట్‌నెస్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వర్కౌట్ ముగిసిన తర్వాత వారితో కరచాలనం చేసి, తిరిగి జాకెట్ ధరించారు.

2021 నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఖురెల్‌సుఖ్, గతంలో సైన్యంలో అధికారిగా పనిచేశారు. ఆయనకు బాడీబిల్డింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. అంతేకాదు, ఆయన ఓ రాక్ బ్యాండ్‌లో గిటారిస్ట్ కూడా. మంగోలియాలో హార్లే-డేవిడ్‌సన్ ఫ్యాన్ క్లబ్‌ను కూడా స్థాపించారు. ప్రస్తుతం ఈ వీడియో 'ఎక్స్', ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో వైర‌ల్ అవుతోంది. బార్‌పై ఉన్న బరువుపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన 100 కిలోలు ఎత్తినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.