పూర్తి పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించు జగన్: కేశినేని చిన్ని

పూర్తి పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించు జగన్: కేశినేని చిన్ని

Kesineni Chinni challenges Jagan to debate DSC transparency in Andhra Pradesh Assembly
  • డీఎస్సీతో 16 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్న కేశినేని చిన్ని
  • డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శ
  • ఐదేళ్ల పాలనలో జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి 16 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ఈ మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని లోకేశ్ సవాల్ విసిరినా జగన్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. త్వరలోనే లోకేశ్ నాయకత్వంలో మరో మూడు డీఎస్సీలను విజయవంతంగా నిర్వహించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


డీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహణకు ఉన్న ప్రాథమిక వ్యత్యాసం కూడా తెలీని వ్యక్తి జగన్ అని కేశినేని చిన్ని ఎద్దేవా చేశారు. స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేకంగా పరీక్షలు ఉండవని, ఆ కేటాయింపులు నేరుగా సర్టిఫికెట్ల ఆధారంగా, మెరిట్ ప్రకారం జరుగుతాయని తెలిసినా వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తికి డీఎస్సీలో ఉద్యోగం వస్తే, ఆయనకు రానట్లు సాక్షి పత్రికలో అబద్ధాలు రాశారని, ఆ బాధితుడు రామకృష్ణ స్వయంగా ఇక్కడే సజీవ సాక్ష్యంగా ఉన్నారని మీడియా ముందు ప్రదర్శించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్, తొమ్మిది నెలలుగా కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు గ్లోబల్ ప్రచారంతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించడం, కోడికత్తి డ్రామాలు ఆడటం జగన్‌కు అలవాటేనని ఎంపీ ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ, గ్రూప్-1 నియామకాలలో జరిగిన భారీ అవకతవకలపై ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుగుతోందని తెలిపారు. ఆ అక్రమాల నివేదిక బయటకు వచ్చి తమ తప్పులు బయటపడతాయనే భయంతోనే డీఎస్సీపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం తప్పని నిరూపించే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని జగన్‌కు సవాల్ విసిరారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని జోస్యం చెప్పారు.

Advertisement
Kesineni Chinni
YS Jagan Mohan Reddy
Mega DSC Recruitment
Nara Lokesh
Andhra Pradesh Education Department
AP DSC Transparency

More Telugu News