పాలనలో స్పీడ్ పెరగాల్సిందే.. ఫైళ్ల జాప్యంపై సీఎం చంద్రబాబు సీరియస్

పాలనలో స్పీడ్ పెరగాల్సిందే.. ఫైళ్ల జాప్యంపై సీఎం చంద్రబాబు సీరియస్

Chandrababu Naidu orders speed in administration and warns against file delays
  • దస్త్రాల పరిష్కారంలో జాప్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
  • నెలరోజుల్లో ప్రభుత్వ ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఆదేశం
  • సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచన
  • క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజా సమస్యలు తెలుసుకోవాలని దిశానిర్దేశం
ప్రభుత్వ దస్త్రాల పరిష్కారంలో జాప్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, పాలనలో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను గట్టిగా హెచ్చరించారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు ఫైళ్లను వీలైనంత వేగంగా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పరిపాలనపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

సకాలంలో దస్త్రాలను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్న కొందరు అధికారుల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోపు ఫైళ్లు క్లియర్ చేసిన వారిని అభినందిస్తూనే, గంటల వ్యవధిలోనే పూర్తి చేసిన వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సమావేశానికి కొందరు ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించారు. పరిపాలనలో జవాబుదారీతనం ముఖ్యమని, ఐఏఎస్ అధికారుల పనితీరుపై 360 డిగ్రీల నివేదికను అందరి అభిప్రాయాలతో రూపొందిస్తామని తెలిపారు. కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించాలని, అప్పుడే పనితీరును మెరుగుపరుచుకోగలమని సూచించారు.

నెల రోజుల్లో ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే..
ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, వేగం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో అన్ని శాఖల దస్త్రాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చాలని స్పష్టం చేశారు. ఈ గడువు తర్వాత భౌతిక (మాన్యువల్) ఫైళ్ల నిర్వహణను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ, మంత్రులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు.

క్షేత్రస్థాయి పర్యటనలతో సమస్యల పరిష్కారం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే దరఖాస్తులను ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. "జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు తరచుగా గ్రామాలకు వెళ్తే చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. ఇకపై ఈ పర్యటనల వివరాలను కూడా సమర్పించాలి" అని అన్నారు.

సమస్యలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడాలని ఆకాంక్షించారు. పనితీరు సరిగా లేని వారిని పక్కనపెట్టి, సమర్థంగా పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సిబ్బందికి జాబ్ ఛార్ట్
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో సిబ్బందిపై పనిభారాన్ని హేతుబద్ధీకరించాలని (రేషనలైజ్ చేయాలని) అధికారులను ఆదేశించారు. ఒకే ఉద్యోగిపై ఎక్కువ భారం మోపకుండా, అందరికీ సమంగా బాధ్యతలు అప్పగించేలా చూడాలన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ సిబ్బందికి విధులను స్పష్టం చేస్తూ ఒక జాబ్ ఛార్ట్ సిద్ధం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయానికి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అందించాలని కూడా సూచించారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Administration
Collectors Conference Amaravati
Online File Management
IAS Officers Performance Report
Swarna Grama Ward Staff

More Telugu News