క్యాన్సర్ చికిత్స రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. రొమ్ము క్యాన్సర్ వ్యాధి స్కాన్‌లలో ముదిరినట్లుగా కనిపించకముందే, కేవలం రక్త పరీక్ష ద్వారా గుర్తించిన జన్యు మార్పు (మ్యుటేషన్) ఆధారంగా చికిత్సను మార్చేందుకు వీలు కల్పించే సరికొత్త ఔషధానికి అమెరికా ఆమోదం తెలిపింది. కామిజెస్ట్రాంట్ (బ్రాండ్ పేరు: ఎట్‌కామా) అనే ఈ డ్రగ్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.

హార్మోన్ రిసెప్టర్ (హెచ్ఆర్)-పాజిటివ్, హెచ్ఈఆర్2-నెగటివ్ రకం అడ్వాన్స్‌డ్ లేదా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఈ మందును సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికే అరోమాటేజ్ ఇన్‌హిబిటర్, సీడీకే 4/6 ఇన్‌హిబిటర్‌లతో చికిత్స పొందుతున్న వారిలో ఈఎస్ఆర్1 అనే మ్యుటేషన్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తించినప్పుడు, కామిజెస్ట్రాంట్‌ను సీడీకే 4/6 ఇన్‌హిబిటర్‌తో కలిపి వాడాల్సి ఉంటుంది. ఈ మేరకు సెప్టెంబర్ 4న ఎఫ్‌డీఏ అధికారికంగా ప్రకటించింది.

చికిత్సలో సరికొత్త విధానం
ఈ చికిత్స విధానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, రక్తంలో తిరుగుతున్న కణితి డీఎన్‌ఏను (ctDNA) విశ్లేషించి, క్యాన్సర్‌కు నిరోధకత పెంచే మ్యుటేషన్‌ను ముందుగానే పసిగట్టడం. ఇమేజింగ్ స్కాన్‌లలో వ్యాధి మళ్లీ విజృంభించినట్లు నిర్ధారణ కాకముందే చికిత్సను మార్చడం ఇదే మొదటిసారి. ఈ మ్యుటేషన్‌ను గుర్తించడానికి 'గార్డెంట్360 సీడీఎక్స్' అనే డయాగ్నోస్టిక్ కిట్‌ను కూడా ఎఫ్‌డీఏ ఆమోదించింది. ఇది క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త మార్గమని, అయితే క్లినికల్ ప్రయోజనాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని ఎఫ్‌డీఏ అధికారి ఆంజెలో డి క్లారో తెలిపారు.

SERENA-6 ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ ఫలితాల ఆధారంగా ఎఫ్‌డీఏ ఈ ఆమోదం ఇచ్చింది. ఈ ట్రయల్స్‌లో కామిజెస్ట్రాంట్ కాంబినేషన్‌ తీసుకున్న రోగులలో వ్యాధి తీవ్రత పెరగకుండా సగటున 16 నెలల పాటు నియంత్రణలో ఉండగా, పాత చికిత్స విధానంలో ఇది కేవలం 9.2 నెలలుగానే ఉంది. ఈ కొత్త ఔషధం వ్యాధి ముదిరే లేదా మరణం సంభవించే ప్రమాదాన్ని 56 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఇది త్వరితగతిన ఇచ్చిన ఆమోదం కావడంతో, దీని పూర్తిస్థాయి ప్రయోజనాలను నిర్ధారించేందుకు తదుపరి అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంటుంది. రోజుకు ఒకసారి 75 మిల్లీగ్రాముల మోతాదులో ఈ ఔషధాన్ని నోటి ద్వారా తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.