ఎన్నికల సమయంలో మా దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్నే విమర్శిస్తావా?: అనిల్ కుమార్ యాదవ్‌పై ప్రశాంతి రెడ్డి ఫైర్
- మంత్రి పదవి పోయినప్పటి నుంచి అనిల్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న ప్రశాంతి రెడ్డి
- అనిల్ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడి
- నెల్లూరు ప్రజలు తంతే నరసరావుపేటలో పడ్డావని ఎద్దేవా
నెల్లూరు జిల్లా పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతూ.. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన విమర్శలపై కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో అనిల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ... ఆయనపై అక్రమ వసూళ్లు, దందాల ఆరోపణలతో విరుచుకుపడ్డారు. గతంలో సాయం కోసం వేమిరెడ్డి వద్దకు వచ్చి దండాలు పెట్టిన సంగతి అనిల్ మర్చిపోయారా? అని నిలదీశారు.
అనిల్ కుమార్ యాదవ్ చేసిన అక్రమ వసూళ్లు, వేధింపుల వల్లే తాము క్వార్జ్ వ్యాపారం నుండి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సుమారు 76 మంది క్వార్జ్ వ్యాపారుల నుంచి అనిల్ వందల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన పత్రాలు, ఆధారాలను మీడియా వేదికగా ప్రదర్శించారు.
"రూప్ కుమార్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే వేమిరెడ్డిపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మా దగ్గర నిధులు తీసుకుని, ఈ రోజు మమ్మల్నే విమర్శిస్తావా? నెల్లూరు ప్రజలు తంతే నరసరావుపేటలో పడ్డావు. అక్కడ ఓడిపోయి చెన్నై వెళ్లావు. జగన్ ఇప్పటికీ నీకు స్పష్టమైన రాజకీయ అడ్రస్ కూడా ఇవ్వలేదు" అని ఎద్దేవా చేశారు.
అనిల్‌ను నమ్ముకున్న ఖలీల్‌తో డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయించారని, ఆయన వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ కాంట్రాక్టర్‌ను తామే కాపాడామని ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. విమర్శలు చేసే ముందు మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.