వయసు కేవలం అంకె మాత్రమేనని, నైపుణ్యం, పట్టుదల ఉంటే ఎంత వయసైనా అడ్డంకి కాదని దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మరోసారి నిరూపించాడు. 47 ఏళ్ల వయసులో టీ20 క్రికెట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతని సమకాలీన క్రికెటర్లు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించగా, తాహిర్ మాత్రం ఇప్పటికీ తన స్పిన్ మాయాజాలంతో అబ్బురపరుస్తూనే ఉన్నాడు.

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్న తాహిర్, సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రోస్టన్ చేజ్ వంటి కీలక వికెట్ కూడా ఉంది. అతని స్పిన్ దెబ్బకు సెయింట్ లూసియా కింగ్స్ 119 పరుగులకే కుప్పకూలింది. అనంతరం గయానా జట్టు 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి సునాయాసంగా విజయం సాధించింది.

ఈ ప్రదర్శనతో 47 ఏళ్ల 167 రోజుల వయసులో టీ20 క్రికెట్‌లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా తాహిర్ రికార్డు సృష్టించాడు. విశేషమేమిటంటే.. అతను తన సొంత రికార్డునే బద్దలు కొట్టాడు. 2025లో 46 ఏళ్ల వయసులో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌పై ఐదు వికెట్లు తీసి ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ వయసులోనూ అతని ఉత్సాహం, ఫిట్‌నెస్ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది.