చంద్రబాబు అక్రమ అరెస్టు.. జగన్ సైకో నిరంకుశత్వానికి, అరాచక పాలన అంతానికి నాంది: అనగాని సత్యప్రసాద్
- చంద్రబాబు అక్రమ అరెస్ట్ జరిగి నేటికి మూడేళ్లు పూర్తయిందన్న అనగాని
- చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజానీకం గళమెత్తిందని వ్యాఖ్య
- అక్రమాలకు పాల్పడిన వైసీపీ 11 స్థానాలకే పరిమితమయిందని ఎద్దేవా
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయడం నాటి సీఎం జగన్ సైకో నిరంకుశత్వానికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అక్రమ అరెస్టు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిందని గుర్తుచేశారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిలువెత్తు నిజాయతీకి ప్రతీకగా నిలిచిన ఓ అగ్రనేతను అన్యాయంగా నిర్బంధించిన ఆ రోజు తెలుగు జాతి చరిత్రలోనే ఒక ‘చీకటి దినం’ అని అభివర్ణించారు.
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకం గళమెత్తారని, ఆ ఆగ్రహజ్వాలలే వైసీపీ అరాచక పాలన అంతానికి నాంది పలికాయని అనగాని పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పరిణామాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందినట్లు ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థల నివేదికల్లోనే స్పష్టమైందని తెలిపారు. దాదాపు 53 రోజుల జైలు జీవితం అనంతరం హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. ఈ అక్రమ అరెస్టు తదనంతర పరిణామాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చారిత్రక కూటమిగా ఏర్పడి... 2024 ఎన్నికల్లో 164 స్థానాల్లో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించగా.. అక్రమాలకు పాల్పడిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందని మంత్రి ఎద్దేవా చేశారు.