పోలవరాన్ని గోదాట్లో కలిపారు.. మెగా డీఎస్సీకి అడ్డుపడ్డారు: సీఎం చంద్రబాబు ఫైర్

పోలవరాన్ని గోదాట్లో కలిపారు.. మెగా డీఎస్సీకి అడ్డుపడ్డారు: సీఎం చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu slams YSRCP for damaging Polavaram and blocking Mega DSC
  • గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర విభజన కన్నా ఎక్కువ నష్టం జరిగిందన్న చంద్రబాబు
  • రాజకీయ కక్షతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆగ్రహం
  • హింసను ప్రేరేపిస్తూ గొడ్డలి పార్టీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపణ 
  • మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వందల కేసులు వేశారని మండిపాటు
  • ప్రజల మద్దతుతోనే పోలవరం, అమరావతి నిర్మాణం సాధ్యమవుతోందని ఉద్ఘాటన
కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే, 'గొడ్డలి పార్టీ' కుట్రలు పన్నుతోందని, జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో ‘మీ భూమి- మీ హక్కు’ సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర విభజన నష్టాలు, గత ప్రభుత్వ తీరు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకషంగా ప్రసంగించారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "రాజకీయ కక్షతో పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను గోదాట్లో కలిపేశారు. కాంట్రాక్టర్‌ను మార్చకుండా ఉంటే 2021కే ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు కరవు పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు రాష్ట్రాన్ని ఆదుకునేది. గత పాలనలో బయటకు రావాలంటే, మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పేపర్లను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లతో దిద్దించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. కల్తీ మద్యం కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు" అని ఆయన ఆరోపించారు.

వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. "ప్రజల సమస్యలపై చర్చించమని అసెంబ్లీకి రమ్మంటే వచ్చేది లేదని మొండికేస్తున్నారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బయటకు వస్తే చాలు, ఎక్కడికి వెళ్లినా హింసే. 'రప్పా రప్పా' అంటూ రౌడీయిజం చేస్తారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లను బలి ఇచ్చి హింసను ప్రేరేపిస్తారు. సామాజిక మాధ్యమాల్లో మా కుటుంబ సభ్యులపై అసభ్యంగా రాతలు రాయిస్తారు. ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?" అని ఆయన ప్రశ్నించారు.

శాంతిభద్రతల విషయంలో తాను ఎప్పుడూ కఠినంగానే వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. "గతంలో నక్సల్స్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాను. అలిపిరిలో నాపై క్లైమోర్ మైన్స్ పేల్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాను. ముఠా కక్షల విషయంలో మాట వినని నా పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేయించిన చరిత్ర నాది. సీఎంగా నేను సమర్థవంతంగా పనిచేయకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది" అని అన్నారు.

కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతు ఢిల్లీలోనూ సంజీవనిగా పనిచేసిందని, దీనివల్లే రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నామని చంద్రబాబు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులను తిరిగి చేపట్టగలిగామన్నారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించానని, ఆ నీటితో ప్రజల ముఖాల్లో ఆనందం చూసినప్పుడు తనకు ఎంతో సంతృప్తి కలిగిందన్నారు. 

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రయత్నిస్తే, 350 కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని, సరైన ఆధారాలు లేవని కోర్టు కూడా వారిని మందలించిందని గుర్తుచేశారు. గొడ్డలి పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బెదిరేది లేదని, ప్రజల కోసమే నిత్యం ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. రూ. 240 కోట్ల వ్యయంతో కోనసీమలో గ్రిడ్ ఆధునీకరణ చేపట్టి 3 ఫేస్ కరెంటు అందిస్తున్నామని, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ పాలనను మెరుగుపరుస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.





Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh CM
Polavaram Project
Mega DSC
YSRCP Criticism
Konaseema Meeting

More Telugu News