‘ఎంత ధైర్యం?’.. విద్యార్థికి నోటీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

‘ఎంత ధైర్యం?’.. విద్యార్థికి నోటీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court angry over notices issued to student for participating in protest
  • న్యాయ విద్యార్థికి గ్రేటర్‌ నోయిడా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ నోటీసులు
  • నోటీసులు ఉపసంహరించినా తీవ్రంగా స్పందించిన కోర్టు
  • విద్యార్థులపై చర్యలు వద్దని గతంలోనే ఆదేశాలిచ్చామని గుర్తుచేసిన కోర్టు
  • యూపీ అధికారులపై అలహాబాద్‌ హైకోర్టు మండిపాటు
  • ఆకృతి చౌధరి ఎన్‌ఎస్‌ఏ నిర్బంధం రద్దు
నిరసనలో పాల్గొన్న ఓ న్యాయ విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని సెప్టెంబర్‌ 1న దేశవ్యాప్తంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. న్యాయ విద్యార్థికి  గ్రేటర్‌ నోయిడా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఆ నోటీసులను తర్వాత ఉపసంహరించుకున్నప్పటికీ.. ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు విద్యార్థికి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయం బుధవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి వచ్చింది. ‘‘మేజిస్ట్రేట్‌ నోటీసులు ఇచ్చే ధైర్యం ఎలా చేశారు? ఏ విద్యార్థిపైనా బలవంతపు చర్యలు తీసుకోవద్దని మేం స్పష్టంగా చెప్పాం. ఆ ఆదేశాలను ఏ మేజిస్ట్రేట్‌ ఉల్లంఘించకూడదు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో విద్యార్థి కార్యకర్త ఆకృతి చౌధరిపై ‘జాతీయ భద్రతా చట్టం’ (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించిన విషయంలో అలహాబాద్‌ హైకోర్టు కూడా యూపీ అధికారులను తీవ్రంగా మందలించింది. అధికారుల చర్యల వల్ల ఉత్తరప్రదేశ్‌ ‘ఆర్వెలియన్‌ డిస్టోపియా’గా మారే పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. అధికారులు తమ విధేయత రాజ్యాంగం పట్ల ఉండాలి తప్ప రాజకీయ నేతల పట్ల కాదని స్పష్టం చేసింది.

నోయిడా డిస్ట్రిక్ మెజిస్ట్రేట్‌ మేధా రూపమ్‌ ఆమోదించిన ఆకృతి చౌధరి ఎన్‌ఎస్‌ఏ నిర్బంధాన్ని సెప్టెంబర్‌ 2న హైకోర్టు కొట్టివేసింది. ఆమెకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నిరసనకు సంబంధించిన కేసుల్లో తగిన ఆధారాలు లేకుండానే కఠినమైన ఎన్‌ఎస్‌ఏను ప్రయోగించడంపై గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లా యంత్రాంగం, పోలీసులపై ధర్మాసనం మండిపడింది.
Advertisement
Supreme Court
Justice Surya Kant
Aakriti Choudhary
Greater Noida Magistrate
Allahabad High Court
National Security Act

More Telugu News