శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్
- మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే వెల్ లోకి దూసుకొచ్చిన బీఆర్ఎస్ సభ్యులు
- బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదన
- స్పీకర్ ను కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఈరోజు మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను తీవ్రంగా అడ్డుకున్నారు. స్పీకర్ ఎంత వారించినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు తగ్గలేదు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ ముగిసేంత వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మీ, కొనికంటి మాణిక్ రావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, కేపీ వివేకానందను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం సభ టీ బ్రేక్ కోసం వాయిదా పడింది. మరోవైపు, సస్పెన్షన్ అనంతరం స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో గందరగోళం మరింత పెరిగింది.
మరోవైపు, సస్పెన్షన్ తీర్మానం వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ తీరుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ఆయన తల్లిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ నేతలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దళిత ప్రజాప్రతినిధులు రోడ్డుపై నిరసన తెలిపి వెళ్తే... ఆ ప్రాంతాన్ని పేడ, పసుపు నీళ్లతో శుద్ధి చేసి అవమానిస్తారా? అని నిలదీశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందని... బీఆర్‌ఎస్ నేతల 'దొరతనం' పోకడలను, బలహీనవర్గాల పట్ల చూపే కుల వివక్షను ఈ రాష్ట్రం ఎంతమాత్రం భరించబోదని స్పష్టం చేశారు. సభాపతి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను చులకన చేసేలా ప్రవర్తిస్తున్న విపక్ష నేతల ఆగడాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.