ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా ఆత్మహత్య
- నోయిడాలోని ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్న రాకేశ్ మెహతా
- షీలా దీక్షిత్ హయాంలో మూడేళ్లకు పైగా సీఎస్ గా పని చేసిన మెహతా
- ఆయన భార్య కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణే
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ మెహతా (74) తీవ్ర విషాదకర రీతిలో ప్రాణాలు తీసుకున్నారు. నోయిడా సెక్టార్-82 లోని కేంద్రీయ విహార్-2 సొసైటీలో ఉన్న తన ఫ్లాట్‌లో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం వద్ద లభ్యమైన సూసైడ్ నోట్‌లో... తాను గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.
రాకేశ్ మెహతా 1975 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. మాజీ ముఖ్యమంత్రి దివంగత షీలా దీక్షిత్ హయాంలో ఆయన 2007 నుండి మూడేళ్లకు పైగా ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఎంసీడీ (MCD) కమిషనర్‌గా పనిచేయడంతో పాటు, 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలోను, ఢిల్లీ రవాణా, విద్యుత్ విప్లవాత్మక మార్పుల్లో ఆయన కీలక భూమిక పోషించారు.
గత ఐదేళ్లుగా ఆయన ఈ నోయిడా ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య (రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి) డెహ్రాడూన్‌లో నివసిస్తుండగా, కుమార్తె లండన్‌లో నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ వెళ్లి చూడగా ఆయన ఉరివేసుకుని కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.