హెచ్ఎల్సీ, హంద్రీనీవా నీరంతా తాగునీటికే అంటే ఎలా?: కూటమి ప్రభుత్వంపై శైలజానాథ్ మండిపాటు
- తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా రైతులకు తాగునీరు విడుదల చేయాలని శైలజానాథ్ డిమాండ్
- తాగునీటి పేరుతో సాగునీటిని ఆపితే ఎలాగని మండిపాటు
- వెంటనే నీటిని విడుల చేసి శింగనమల రైతులను ఆడుకోవాలని డిమాండ్
తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణం వద్ద రైతులతో కలిసి మాజీ మంత్రి, వైసీపీ నేత సాకే శైలజానాథ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాభావంతో ఎండిపోయిన వేరుశనగ, కంది పంటల మొక్కలను చేతుల్లో పట్టుకుని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టు భూములను ఎండబెట్టడం దారుణమని, హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా ప్రాజెక్టుల నీటిని కేవలం తాగునీటి అవసరాలకే కేటాయిస్తామనడం పాలకుల అనాలోచిత విధానాలకు అద్దం పడుతోందని శైలజానాథ్ మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాగునీటి పేరుతో సాగునీటిని పూర్తిగా నిలిపివేస్తే అన్నదాతలు ఏమైపోవాలి? రైతు సమస్యలపై కూటమి ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి ఉందా? అని శైలజానాథ్ సూటిగా ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గానికి తక్షణమే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని, లేనిపక్షంలో అనంతపురం జిల్లావ్యాప్తంగా రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.