ఆగస్టులో వాహనాల జోరు.. ఏకంగా 17.51 శాతం పెరిగిన అమ్మకాలు

ఆగస్టులో వాహనాల జోరు.. ఏకంగా 17.51 శాతం పెరిగిన అమ్మకాలు

Vehicle sales surge in August with 1751 percent growth
  • ఆగస్టులో 24.23 లక్షల వాహనాలు విక్రయం
  • ఏడాది ప్రాతిపదికన 17.51 శాతం పెరిగిన వాహన అమ్మకాలు
  • 19.69 శాతం పెరిగిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు
  • తొలిసారి 4 లక్షలు దాటిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు
  • త్రిచక్ర వాహన అమ్మకాల్లో ఈవీల వాటా 65.30 శాతం
దేశీయ వాహన మార్కెట్‌ ఆగస్టులో సరికొత్త రికార్డు సృష్టించింది. అన్ని విభాగాల్లో కలిపి 24,23,201 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే అమ్మకాలు 17.51 శాతం పెరిగాయి. ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌’ (ఎఫ్‌ఏడీఏ) సోమవారం ఈ వివరాలు వెల్లడించింది.

ఆగస్టులో ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్‌ వెహికల్స్‌, కమర్షియల్‌ వెహికల్స్‌, ట్రాక్టర్లు, త్రిచక్ర వాహనాలు అత్యధిక అమ్మకాలు నమోదు చేశాయి. వీల్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ అమ్మకాలు 31.45 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహనాల్లో 19.69 శాతం, ప్యాసింజర్‌ వాహనాల్లో 16.14 శాతం, కమర్షియల్‌ వాహనాల్లో 14.45 శాతం వృద్ధి నమోదైంది.

ద్విచక్ర వాహనాలు 17,14,610 అమ్ముడయ్యాయి. ఇది ఆగస్టులో ఇప్పటివరకు నమోదైన అత్యధిక అమ్మకాలు. ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 4,02,398కి చేరాయి. తొలిసారి ఆగస్టులో 4 లక్షల మార్క్‌ను దాటాయి. కమర్షియల్‌ వాహనాలు 90,769 అమ్ముడయ్యాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 1,22,281గా నమోదయ్యాయి. వీటిలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 65.30 శాతంగా ఉంది.

అయితే జులైతో పోలిస్తే ఆగస్టు అమ్మకాలు 6.48 శాతం తగ్గాయి. వర్షాకాలంలో సాధారణంగా కొనుగోళ్లు మందగించడం దీనికి కారణం. గణేశ్‌ చతుర్థి, ఓనం పండుగల కొనుగోళ్లు సెప్టెంబర్‌కు మారడం కూడా ప్రభావం చూపిందని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు సాయి గిరిధర్‌ తెలిపారు.

సెప్టెంబర్‌పై డీలర్లు ఆశావహంగానే ఉన్నారు. 67.09 శాతం మంది అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండుగల సీజన్‌ మొదలవడంతో ఇప్పటికే 43.59 శాతం మంది డీలర్ల వద్ద బుకింగ్స్‌ పెరుగుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల లోటు, సెప్టెంబర్‌ 1 నుంచి వాహనాల ధరల పెంపు ప్రభావం చూపొచ్చని ఎఫ్‌ఏడీఏ తెలిపింది.
Advertisement
FADA
Indian Automobile Sales
Vehicle Sales August 2024
Two Wheeler Sales Growth
Passenger Vehicle Sales India
Festive Season Auto Market

More Telugu News