పవన్ కల్యాణ్ ఎఫెక్ట్.. ఆంధ్రా పేపర్ మిల్లుకు భారీ జరిమానా

Pawan Kalyan effect Andhra Paper Mill faces heavy fine for pollution
  • ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ. 21.01 కోట్ల పర్యావరణ జరిమానా
  • కాలుష్య నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘిస్తున్నందుకు ప్రభుత్వ చర్యలు
  • పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో జరిమానా విధింపు
  • మిల్లుకు రూ. 21.34 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్లు ఆరోపణలు
  • యాజమాన్యం తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తూ, పవిత్ర గోదావరి నదిని కలుషితం చేస్తున్నందుకు గాను ఏకంగా రూ. 21.01 కోట్ల భారీ పర్యావరణ జరిమానా విధించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే మిల్లు యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కొన్ని రోజులకే ఈ కఠిన చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పవన్ కల్యాణ్ ఆంధ్రా పేపర్ మిల్లు వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి నగరంలో వెలువడుతున్న మొత్తం కాలుష్యంలో దాదాపు సగం ఆంధ్రా పేపర్ మిల్లు నుంచే వస్తోందని ఆయన ఆరోపించారు. నగరం నుంచి రోజుకు 70 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు ఉత్పత్తి అవుతుండగా, ఒక్క మిల్లు నుంచే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు గోదావరి పరిసరాల్లోకి విడుదలవుతున్నాయని తెలిపారు. మిల్లు నుంచి విడుదలవుతున్న నీటి నమూనాలను పరీక్షించగా, బీఓడీ, ఫాస్ఫేట్లు, సల్ఫైడ్లు వంటి హానికారక రసాయనాలు నిర్దేశిత ప్రమాణాల కన్నా అత్యధికంగా ఉన్నట్లు తేలిందని వివరించారు. ఈ కాలుష్యం వల్ల గోదావరి నదిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాలకు ముప్పు వాటిల్లుతోందని, దుర్వాసనతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్యంతో పాటు పన్ను ఎగవేత అంశాన్ని కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. 2016 నుంచి సుమారు రూ. 21.34 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు మిల్లు యాజమాన్యం పదేపదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తోందని విమర్శించారు.

గడిచిన మూడు నెలలుగా పీసీబీ అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా యాజమాన్యం నుంచి స్పందన కరవైందని తెలిపారు. తక్షణమే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. 'స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు' లక్ష్య సాధనలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని, పద్ధతి మార్చుకోకపోతే మిల్లు కార్యకలాపాలను నిలిపివేయడం, ఆస్తులు జప్తు చేయడం, లైసెన్సు రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తొలి విడతగా భారీ జరిమానా విధించింది. ఇకపైనా యాజమాన్యం తీరు మారకపోతే మరింత కఠినమైన చర్యలు ఎదుర్కోక తప్పదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Advertisement
Pawan Kalyan
Andhra Paper Limited
Godavari River pollution
Andhra Pradesh Pollution Control Board
Rajahmundry environmental fine
Andhra Paper Mill penalty

More Telugu News