టీటీడీలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, నోట్ల కట్టలు

Mendu Lokanadham TTD Deputy EO House Raided Kilos Of Gold And Cash Seized
  • టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇళ్లపై ఏసీబీ దాడులు
  • ప్రభుత్వ విలువ ప్రకారం రూ.5 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
  • 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.5 లక్షల నగదు స్వాధీనం
  • కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పలుచోట్ల ఇళ్లు, స్థలాలు
  • కొనసాగుతున్న సోదాలు.. మరింత పెరగనున్న ఆస్తుల విలువ
టీటీడీలో ఓ ఉన్నతాధికారి అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిన్న‌ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. తొలిరోజు సోదాల్లోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ‌ కూడా తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కిలోల కొద్దీ బంగారం.. భారీగా నగదు
ఏసీబీ అధికారులు తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని లోకనాథం ఇంట్లో జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బీరువాలో దాచిన 2 కిలోల బంగారు ఆభరణాలు, 6.5 కిలోల వెండి వస్తువులు, రూ.12.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు, ఒక జీ+3 భవనం, మరో జీ+1 భవనానికి సంబంధించిన కీలక పత్రాలను కూడా అధికారులు గుర్తించారు. లోకనాథం, ఆయన కుమారుడి పేరుతో బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్లను గుర్తించారు. అయితే, ఆయన పేరుతో ఉన్న బ్యాంక్ లాకర్‌ను తెరిచి చూడగా అందులో ఏమీ లభించలేదు.

బంధువుల పేర్లతో ఆస్తుల బదలాయింపు
లోకనాథం తన అక్రమాస్తులను ఎక్కువగా కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఆయన భార్య మంజుల పేరుతో తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఒక ఇల్లు, గొల్లవానిగుంటలో రెండు ఇంటి స్థలాలు, వడమాలపేట మండలంలో ఒక ప్లాట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయన కుమారుడి పేరుతో తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఓ ఇంటి స్థలం ఉంది. లోకనాథం భార్య, మరొకరి పేరుతో ఉమ్మడిగా రూ.31.98 లక్షల విలువైన మరో ఆస్తి ఉన్నట్టు తేలింది. సోదాల్లో భాగంగా లోకనాథం బావలు మునికృష్ణ, రమేశ్‌ ఇళ్లతో పాటు సోదరుడు వేణు ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా నగదు, బంగారంతో పాటు 10 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం.

కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరి..
వాస్తవానికి లోకనాథం 1989 ఫిబ్రవరి 1న కారుణ్య నియామకం కింద టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం పదోన్నతులు పొందుతూ సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఈవో, డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన, గతంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ పనిచేశారు. తిరుమలలోని ఆయన క్వార్టర్స్‌ను ఏసీబీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి ఇంత భారీ అవినీతికి పాల్పడటం తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Mendu Lokanadham
TTD Deputy EO ACB Raid
Tirupati Corruption Case
Anti Corruption Bureau Andhra Pradesh
TTD Official Disproportionate Assets
Tirumala Tirupati Devasthanams News

More Telugu News