గోదావరి జలాలు తెచ్చిన చంద్రబాబుకు ఉత్తరాంధ్ర రైతుల జేజేలు.. పాయకరావుపేటలో పండగ వాతావరణం

Chandrababu Naidu hailed by North Andhra farmers for bringing Godavari waters to Payakaraopeta
  • దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
  • పాయకరావుపేట వద్ద నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
  • 4 జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు
  • ఇక ఉత్తరాంధ్రకే వలసలు వస్తాయన్న ముఖ్యమంత్రి
  • గోదావరి జలాలు తీసుకొచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
దశాబ్దాల కాలం నాటి కల సాకారమైంది. ఉత్తరాంధ్ర బీళ్లకు జీవం పోసేందుకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తరలివచ్చింది. ఈ చారిత్రక ఘట్టంతో పులకించిపోయిన ఉత్తరాంధ్ర రైతులు, ప్రజలు.. తమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఈ అపూర్వ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.

బుధవారం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర భూముల్లోకి అడుగుపెట్టిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న పవిత్ర జలాలను శిరస్సున చల్లుకుని, భావోద్వేగంతో కాలువలో నిల్చుని పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానిక రైతులు, మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.

ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుంది: సీఎం

అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలతో కళకళలాడతాయి. అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో అనకాపల్లికి వచ్చిన గోదారమ్మను.. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూరీడి పాదాల వద్దకు తీసుకెళ్లి, వంశధార వరకు గోదావరి జలాలను తరలిస్తాం" అని స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ కోసం ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.800 కోట్లతో మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నీటితో విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలు తరలించనున్నట్టు వివరించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

"2019లో వచ్చిన గొడ్డలి పార్టీ పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయేలా చేసింది. 2024లో ప్రజలు కూటమిని గెలిపించి పోలవరానికి శాప విముక్తి కలిగించారు" అని చంద్రబాబు విమర్శించారు. ప్రతి నీటి చుక్క వెనుక ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, నిర్వాసితుల త్యాగం ఉన్నాయని కొనియాడారు.

అభివృద్ధికి చిరునామాగా ఉత్తరాంధ్ర

"గతంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లేవారు. ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి కల్పిస్తాం. విశాఖ ఏఐ పట్నంగా, నాలెడ్జ్‌ ఎకానమీ కేంద్రంగా మారుతుంది. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలతో ఈ ప్రాంతం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుంది" అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. డేటా సెంటర్లకు నీటి కొరత వస్తుందన్నది తప్పుడు ప్రచారమని, వాటికి అవసరమైన 5 టీఎంసీల కంటే ఎడమ కాలువ ద్వారా ఎన్నో రెట్ల నీరు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సభా వేదిక నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం, ప్రాజెక్టు కోసం కృషి చేసిన ఇంజినీర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Godavari Water North Andhra
Polavaram Left Main Canal
Anakapalli Payakaraopeta
Andhra Pradesh Irrigation
Uttarandhra Farmers

More Telugu News