భారత్‌లో భారీగా ఉద్యోగాలు ఇవ్వనున్న 5 రంగాలు ఇవే.. వరల్డ్‌ బ్యాంక్‌ చీఫ్ కీలక వ్యాఖ్యలు

World Bank Chief Ajay Banga identifies five key sectors for job growth in India
  • మౌలిక వసతులను అత్యంత కీలక రంగంగా పేర్కొన్న అజయ్‌ బంగా
  • చిన్న రైతుల వ్యవసాయానికి టెక్నాలజీ సాయం అవసరమని సూచన
  • ప్రాథమిక ఆరోగ్య సేవల్లో భారీ ఉపాధి అవకాశాలున్నాయని వెల్లడి
  • పర్యాటక రంగాన్ని భారీ అవకాశంగా అభివర్ణించిన వరల్డ్‌ బ్యాంక్‌ చీఫ్‌
  • విలువ ఆధారిత తయారీతో ఉద్యోగాలు పెరుగుతాయని వెల్లడి
భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్న ఐదు కీలక రంగాలను వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా గుర్తించారు. మౌలిక వసతులు, వ్యవసాయం, ప్రాథమిక ఆరోగ్య సేవలు, పర్యాటకం, విలువ ఆధారిత తయారీ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడొచ్చని చెప్పారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బంగా మాట్లాడుతూ.. భారత్‌ ఆర్థిక వృద్ధిని యువ జనాభాకు ఉద్యోగాలుగా మార్చాలంటే ప్రైవేట్‌ పెట్టుబడులు చాలా కీలకమని చెప్పారు. ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తే.. ప్రైవేట్‌ రంగం ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావచ్చని అన్నారు.

బంగా జాబితాలో మౌలిక వసతులు మొదటి స్థానంలో ఉన్నాయి. రహదారులు, నిర్మాణ రంగంలో నేరుగా ఉపాధి లభించడంతో పాటు మెరుగైన కనెక్టివిటీ వల్ల ఇతర ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయని చెప్పారు. 

రెండోది చిన్న రైతుల ఆధారిత వ్యవసాయ రంగం. ఉత్తర్‌ప్రదేశ్‌లో టెక్నాలజీ సాయంతో సహకార సంఘాలు చిన్న రైతులకు అవసరమైన విత్తనాలు, ఇతర ఇన్‌పుట్స్‌ను పెద్ద స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడాన్ని తాను చూశానని బంగా వివరించారు.

ప్రాథమిక ఆరోగ్య సేవలను స్థానిక స్థాయిలో క్లినిక్‌ల ద్వారా అందిస్తే భారీగా ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. నర్సులు, డయాగ్నోస్టిక్‌ టెక్నీషియన్లు, మిడ్‌వైఫ్‌లకు ఉపాధి లభిస్తుందని, డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా వీటిని పెద్ద ఆసుపత్రులు, వైద్యులతో అనుసంధానించవచ్చని తెలిపారు.

పర్యాటక రంగాన్ని కూడా భారీ అవకాశంగా బంగా అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు చెప్పారు. ఐదో రంగంగా విలువ ఆధారిత తయారీని పేర్కొన్నారు. ఖనిజాలు, లోహాలు, ఫ్యాషన్‌ వంటి రంగాల్లో భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఉద్యోగాలతో పాటు ఆర్థిక విలువ కూడా పెరుగుతుందని బంగా అన్నారు.
Advertisement
Ajay Banga
World Bank
India Job Creation
MSME Sector India
Indian Economy Growth
Infrastructure and Tourism Jobs

More Telugu News