సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

  • 2020లో 14వ అంతస్తు నుంచి కిందపడి దిశ మృతి
  • ఆమెది ఆత్మహత్య అని తొలుత పేర్కొన్న పోలీసులు
  • కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో నమోదైన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం, దిశా సాలియాన్ అనుమానాస్పద మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది.


వివరాల్లోకి వెళితే... జూన్ 2020లో ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న 14వ అంతస్తు భవనం నుంచి కిందపడి దిశా సాలియాన్ మృతి చెందారు. ఆమెది ఆత్మహత్య అని మొదట్లో పోలీసులు పేర్కొన్నప్పటికీ... ఆ తర్వాత తీవ్ర అనుమానాలు, రాజకీయ ఆరోపణలు వ్యక్తమయ్యాయి.


మూడేళ్లకు పైగా కేవలం యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ ప్రాతిపదికన మాత్రమే దర్యాప్తును కొనసాగించడం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరిపి నిజాన్ని బయటకు తీసేందుకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్రంగా విచారించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.


గతంలో శివసేన (యుబిటి) నేత ఆదిత్య థాకరేపై దిశా తండ్రి సతీశ్ సాలియాన్ ఆరోపణలు చేస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరగా... సరైన ఆధారాలు లేకుండా ఎవరినీ నిందితులుగా పేర్కొనలేమని, అయితే పారదర్శక దర్యాప్తు అత్యవసరమని కోర్టు పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటన జరగడంతో, సీబీఐ విచారణ నిర్ణయం బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది.

Advertisement

More Telugu News