Advertisement

పౌరసేవల్లో డేటా అనలటిక్స్.. పాలనలో కొత్త శకానికి చంద్రబాబు శ్రీకారం

Data analytics in public services Chandrababu Naidu begins new era in governance
  • రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
  • ప్రజల అభిప్రాయాలు, డేటా ఆధారంగా పౌరసేవలు మెరుగుపరచాలని సీఎం ఆదేశం
  • పారిశుధ్యంపై రాజీ లేదని, సంక్షేమ హాస్టళ్లలో నెలకోసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని సూచన
  • ప్రభుత్వ శాఖల సేవలు, ధ్రువపత్రాల జారీ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరగాలని నిర్దేశం
  • వెలిగొండ తరహాలో ప్రతి కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం పెంచాలని పిలుపు
  • నిరుపయోగంగా ఉన్న 5.70 లక్షల ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకోవాలని ఆదేశాలు
ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, డేటా అనలటిక్స్‌ను విశ్లేషించడం ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌరసేవలను మరింత మెరుగుపరచాలని, అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ (ఆర్టీజీ)పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, అల్లూరి విమానాశ్రయం వంటి కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని, ఇదే స్ఫూర్తిని ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కొనసాగించి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.

రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు తాను 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో 20 సార్లు పాల్గొన్నానని గుర్తుచేశారు. ఇదే క్రమంలో సంక్షేమ హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు.

 ప్రతి నెలా మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టళ్లకు ఆహ్వానించి, అక్కడి పరిస్థితులు, భోజనం, తాగునీటి సౌకర్యాలపై వివరించాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నార్తులకు సాయం అందించే దాతలను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందించాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ సహా అన్ని విభాగాలు ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీకృత సేవల విధానం ద్వారా ప్రజలకు వేగంగా నిర్ణయాలు అందేలా చూడాలని అన్నారు. పనితీరు ఆధారంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బాధ్యులకు ర్యాంకులు ఇవ్వాలని, లోటుపాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సరిదిద్దుకోవాలని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగంలో 'అవేర్' (AWARE) వేదిక ద్వారా రాష్ట్రంలోని సాగు పరిస్థితిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, రైతులకు అవసరమైన సూచనలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రకృతి సేద్యం చేసే రైతులను పూర్తిస్థాయిలో ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న 5.70 లక్షల ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Real Time Governance
Data Analytics Andhra Pradesh
Swachh Andhra
Public Service Delivery
AWARE Platform Agriculture

More Telugu News