Advertisement

రవితేజ 'ఇరుముడి'పై దిల్ రాజు ప్రశంసలు.. ఆసక్తికర వ్యాఖ్యలు

Dil Raju praises Ravi Teja Irumudi movie and makes interesting comments
  • 'ఇరుముడి' విజయం ఇండస్ట్రీ మొత్తానికి జోష్ ఇచ్చిందన్న దిల్ రాజు
  • ఒక మంచి సినిమా ఎలాంటి శక్తినిస్తుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుందన్న వ్యాఖ్య
  • 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రవితేజ సినిమా
రవితేజ కథానాయకుడిగా నటించిన 'ఇరుముడి' చిత్రంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్ర విజయం కేవలం చిత్ర బృందానికే కాకుండా, యావత్ టాలీవుడ్ పరిశ్రమకు నూతనోత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. సోమవారం జరిగిన 'కూర్మ అవతార్' చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, "ఒక మంచి సినిమా ఎంతటి శక్తిని ఇస్తుందో 'ఇరుముడి' నిరూపించింది. ఈ చిత్రం సాధించిన విజయం పరిశ్రమలోని మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ప్రేక్షకులు ఇదే రీతిలో పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలివస్తే, మాలాంటి నిర్మాతలకు ఎంతో ధైర్యంగా ఉంటుంది" అని వివరించారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, రూ. 200 కోట్ల క్లబ్ దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో కలిపి ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఈ చిత్రం 1.25 లక్షల టికెట్ల విక్రయాలతో 1.5 మిలియన్ డాలర్లు వసూళ్లను సాధించింది.

కాగా, ఇటీవల యశ్ నటించిన 'టాక్సిక్' సినిమాను దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఆ సమయంలో, అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న 'ఇరుముడి'ని కొన్ని థియేటర్ల నుంచి తొలగించి 'టాక్సిక్' చిత్రానికి కేటాయించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, 'టాక్సిక్' ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, పలు థియేటర్లలో తిరిగి 'ఇరుముడి' చిత్రానికే ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Dil Raju
Ravi Teja
Irumudi Movie
Irumudi Box Office Collection
Shiva Nirvana

More Telugu News