Advertisement

భారతీయులకు ఉజ్బెకిస్థాన్ గుడ్ న్యూస్.. 30 రోజుల వీసా ఫ్రీ ప్రయాణం

Uzbekistan Good News for Indians 30 Days Visa Free Travel
  • పర్యాటకం, వాణిజ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఉజ్బెకిస్థాన్ నిర్ణయం
  • గతేడాది తొలిసారి 1 బిలియన్ డాలర్లు దాటిన ద్వైపాక్షిక వాణిజ్యం
  • భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని చెప్పిన ఆ దేశ‌ అధ్యక్షుడు
  • ప్రధాని మోదీ తాష్కెంట్ పర్యటనలో వెలువడిన ఈ కీలక ప్రకటన
భారత పౌరులకు ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతీయులకు 30 రోజుల పాటు వీసా రహిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో ఆ దేశ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ జరిపిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా మిర్జియోయెవ్ మాట్లాడుతూ.. భారత్ తమకు 'నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామి' అని అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. "గతేడాది తొలిసారిగా మన ద్వైపాక్షిక వాణిజ్యం 1 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల సంయుక్త సంస్థల సంఖ్య ఏడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య వారానికి 14 ప్రత్యక్ష విమాన సర్వీసులు నడుస్తున్నాయి" అని ఆయన వివరించారు.

ఈ వీసా ఫ్రీ నిర్ణయంతో భారత పర్యాటకులు, వ్యాపారులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. కేవలం రాజకీయ, దౌత్యపరమైన సంబంధాలకే పరిమితం కాకుండా సాంస్కృతిక బంధాన్ని కూడా పటిష్ఠం చేసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. తాష్కెంట్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్, మహాత్మా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ వంటి సంస్థలు సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతున్నాయని మిర్జియోయెవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉజ్బెకిస్థాన్‌లో యోగాకు విశేష ఆదరణ లభిస్తోందని, 2018లోనే ప్రత్యేకంగా యోగా ఫెడరేషన్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

ఉజ్బెకిస్థాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1992 మార్చి 18న భారత్‌తో దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. 2011లో ఈ బంధం వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. ప్రధాని మోదీ 2015 తర్వాత ఉజ్బెకిస్థాన్‌లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. తన పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ, కిర్గిజ్ అధ్యక్షుడు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బిష్కెక్‌కు చేరుకున్నారు.
Advertisement
Uzbekistan
Narendra Modi
Visa free travel
Indian citizens
Shavkat Mirziyoyev
India Uzbekistan relations

More Telugu News