Advertisement

బెంగళూరు వచ్చి బాధితులతో మాట్లాడండి: రాహుల్‌కు కుమారస్వామి సవాల్

HD Kumaraswamy challenges Rahul Gandhi to visit Bengaluru and talk to victims
  • కేపీఎస్సీ నియామకాల కుంభకోణంపై రాహుల్ గాంధీ మౌనాన్ని ప్రశ్నించిన కుమారస్వామి
  • కోట్లాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు
  • ప్రశ్నపత్రాలను రిసార్టులకు తీసుకెళ్లి అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారని వ్యాఖ్య
  • బెంగళూరు వచ్చి బాధితులతో చర్చించాలని రాహుల్ గాంధీకి సవాల్
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) నియామకాల కుంభకోణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి విమ‌ర్శించారు. ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.

నిన్న‌ బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయం ‘జేపీ భవన్’లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి.. "మీరు ఎక్కడున్నారు? ఇక్కడ కేపీఎస్సీ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పడుతోంది. దేశమంతా పర్యటిస్తూ విద్యార్థులు, యువతతో ముచ్చటించే మీరు.. బెంగళూరుకు ఎప్పుడు వచ్చి కేపీఎస్సీ బాధితుల సమస్యలపై చర్చిస్తారు?" అని నిలదీశారు.

ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయలకు పోస్టులను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. "ప్రశ్నపత్రాలను రిసార్టులకు తరలించి, డబ్బు చెల్లించిన అభ్యర్థులకు ముందే అందజేశారు. సమాధానాలు ఎలా రాయాలో కూడా వారికి అక్కడ శిక్షణ ఇచ్చారు" అని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార సంస్థ (బీడీఏ)లో వివాదాస్పద రికార్డు ఉన్న వ్యక్తిని కేపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించారని ఆయన విమర్శించారు.

సొంత శాఖలోని సమస్యలను పట్టించుకోకుండా, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు చేయడంపై ఆయన ఎద్దేవా చేశారు. ఈ స్కామ్ కేసులో ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అరెస్టు అయిన నేపథ్యంలో కుమారస్వామి విమర్శలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తక్షణమే రాహుల్ గాంధీ బెంగళూరుకు వచ్చి బాధితులతో ముఖాముఖి చర్చించాలని ఆయన సవాల్ విసిరారు.                                
Advertisement
HD Kumaraswamy
Rahul Gandhi
KPSC Recruitment Scam
Karnataka Congress Government
Bengaluru
Karnataka Politics

More Telugu News