విశాఖలో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి.. రేపు ఏఐజీకి శంకుస్థాపన చేయనున్న లోకేశ్

Nara Lokesh to lay foundation stone for international standard AIG hospital in Visakhapatnam tomorrow
  • విశాఖలో కొలువుదీరనున్న ఏఐజీ ఆసుపత్రి
  • సోమవారం శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేశ్
  • రూ.2,000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా 9,000 మందికి ఉపాధి
  • వెయ్యి పడకలతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగం మరో కీలక మైలురాయిని అందుకోబోతోంది. ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఆసుపత్రి ఇప్పుడు విశాఖపట్నంలో తన శాఖను ఏర్పాటు చేయనుంది. ప్రజాప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖలో, ఈ ప్రపంచ స్థాయి వైద్య సంస్థ రాక ఆరోగ్య రంగానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. నగరంలోని ఎండాడ ప్రాంతంలో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, రాష్ట్ర ప్రజలు ఇకపై అత్యున్నత వైద్యం కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది.

భారీ పెట్టుబడి, ఉపాధి అవకాశాలు

విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ రాబోయే ఐదేళ్లలో దశలవారీగా రూ.2,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 9,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి మొత్తం సామర్థ్యం వెయ్యి పడకలకు చేరుకుంటుంది. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) ద్వారా రోజుకు 5,000 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిన తర్వాత సుమారు 1000 మంది డాక్టర్లు ఇక్కడ సేవలు అందించనున్నారు.

ప్రాజెక్టు స్వరూపం, నిర్మాణ ప్రణాళిక

విశాఖలోని ఎండాడలో మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి క్యాంపస్‌ను, మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను నిర్మించనున్నారు. వైద్య సేవలు, శిక్షణ, పరిశోధనలతో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన సమగ్ర హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌ను ఒకేచోట ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

మొదటి దశలో టవర్-ఏ, టవర్-బి నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో చేపట్టి, 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో టవర్-సి నిర్మాణాన్ని 350 పడకల సామర్థ్యంతో మరో రెండేళ్లలో పూర్తి చేస్తారు. హైదరాబాద్‌లోని ఏఐజీ తరహాలోనే ఇక్కడ కూడా 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో పాటు 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ప్రత్యేక మాతా శిశు విభాగం కూడా ఉంటుంది.

పరిశోధన, శిక్షణకు పెద్దపీట

వైద్య సేవలతో పాటు విద్య, పరిశోధనలకు ఏఐజీ పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా నర్సింగ్ కళాశాల, సిబ్బందికి హాస్టల్, పారామెడిక్ సిబ్బందికి శిక్షణా కేంద్రం, 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మించనున్నారు. క్లినికల్ వ్యవస్థలోనే రీసెర్చ్ ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సెంటర్‌ను ఏర్పాటు చేయనుండటం విశేషం. విజిటింగ్ ఫ్యాకల్టీ, వైద్యుల కోసం వసతితో పాటు రోగుల సహాయకుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. 

వైద్య రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఏఐజీ, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ యూనిట్‌గా గుర్తింపు పొందింది. ఈ ఆసుపత్రి రాకతో విశాఖ హెల్త్‌కేర్ హబ్‌గా మారడమే కాకుండా, ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కూడా అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Advertisement
Nara Lokesh
AIG Hospital Visakhapatnam
Asian Institute of Gastroenterology
Andhra Pradesh Healthcare
Vizag Medical Hub
AIG Hospital Foundation Stone

More Telugu News