ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. టెక్నాలజీతోనే సేవలు: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Says No Need To Visit Government Offices Services Through Technology
  • టెక్నాలజీతో ప్రభుత్వ సేవలు మరింత సులభతరం
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు డేటా ఇంటిగ్రేషన్ విధానం
  • ఎల్‌నినో ప్రభావం.. పంటల దిగుబడిపై సమీక్ష
  • డెంగీ, మలేరియా నివారణకు హాట్‌స్పాట్‌ల గుర్తింపు
  • శాఖల్లో సమర్థత, సేవల నాణ్యత పెంచాలని సీఎం ఆదేశం
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందాలని, ఇందుకోసం ఏఐ అసిస్టెంట్, బ్లాక్ చెయిన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పదేపదే వాటిని అప్‌లోడ్ చేసే పనిలేకుండా ‘డేటా ఇంటిగ్రేషన్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు తమ సమర్థతను పెంచుకుని, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి పంటల దిగుబడి సాధారణం కన్నా 20 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా నీరందించగలమని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు నీటి కొరత లేకుండా చూడాలన్నారు. సాగు ప్రారంభించని చోట్ల వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. రైతులకు పంపే క్రాప్ అలర్ట్‌లపై తీసుకుంటున్న చర్యలను కూడా పర్యవేక్షించాలని, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు.

అలాగే, ప్రజారోగ్యంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు వ్యాధి ప్రబలుతున్న హాట్‌స్పాట్‌లను గుర్తించి, తక్షణ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి డెంగీ కేసులు గణనీయంగా తగ్గాయని అధికారులు వివరించారు. గత ఏడాది ఇదే సమయానికి 1,361 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 401 కేసులు మాత్రమే నమోదైనట్టు తెలిపారు.

రాష్ట్రాన్ని కార్బన్ న్యూట్రల్ లక్ష్యం వైపు నడిపించాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం పునరుత్పాదక ఇంధన వనరులపై, ముఖ్యంగా సోలార్ రూఫ్ టాప్‌ల ఏర్పాటుపై దృష్టి సారించి, ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.


Advertisement
Chandrababu Naidu
AI Blockchain Governance
Andhra Pradesh Public Services
AP Agriculture El Nino Impact
Dengue Cases Andhra Pradesh
Solar Rooftop Energy AP

More Telugu News