రామోజీపై విమర్శలా? ముందు పోలవరం సంగతి చెప్పు!: అంబటికి మంత్రి నిమ్మల కౌంటర్

Nimmala Rama Naidu counters Ambati Rambabu over criticisms against Ramoji Rao
  • రామోజీరావును విమర్శించడం ఆకాశంపై ఉమ్మేయడమేనన్న మంత్రి నిమ్మల
  • నైతికత లేని అంబటి రాంబాబు ఆ అర్హత కోల్పోయారని ఘాటు వ్యాఖ్యలు
  • మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసిన మంత్రి
  • పోలవరం వైఫల్యంపై అంబటి సమాధానం చెప్పాలని డిమాండ్
  • రామోజీ స్థాయికి, వైసీపీ నేతల స్థాయికి నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా అని ఫైర్
వైసీపీ నేత అంబటి రాంబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన రామోజీరావు గారిని విమర్శించడం ఆకాశంపై ఉమ్మివేయడమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. నైతికత గురించి మాట్లాడే అర్హతే లేని అంబటి రాంబాబు, రామోజీరావు వంటి మహనీయుడిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.

ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషాకిరణ్ మూవీస్ వంటి సంస్థల ద్వారా తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన రామోజీరావు సేవలను మంత్రి నిమ్మల గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి జగన్ పాలన వరకు, ప్రజా సమస్యలపై గళమెత్తినందుకే రామోజీరావుపై, ఆయన సంస్థలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా ఆయన న్యాయపోరాటం చేసి నిలిచారని అన్నారు. మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, న్యాయస్థానం ఇచ్చిన స్పష్టతను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దని హితవు పలికారు.

2006లో మార్గదర్శిపై వివాదాలు సృష్టించినప్పుడు డిపాజిట్‌దారుల ప్రయోజనాలే పరమావధిగా భావించి, తన సొంత ఆస్తులను సైతం పణంగా పెట్టి చెల్లింపులు జరిపిన ఆయన విశ్వసనీయతను గుర్తుంచుకోవాలని అన్నారు. చిరునామాలు సరిగా లేని కారణంగా చెల్లించలేని డిపాజిట్లను కూడా ఎస్క్రో ఖాతాల్లో భద్రపరిచారని తెలిపారు. ఇంతటి నిజాయతీపరుడిని విమర్శించే ముందు, గత ప్రభుత్వంలో తన శాఖ పనితీరుపై అంబటి ఆత్మపరిశీలన చేసుకోవాలని నిమ్మల హితవు పలికారు.

"జలవనరుల శాఖ మాజీ మంత్రిగా, పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో అంబటి రాంబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజాపక్షం వహించిన ఒక గొప్ప వ్యక్తిపై బురద చల్లడం ఎంతవరకు సమంజసం?" అని నిమ్మల ప్రశ్నించారు. రామోజీరావు గారి స్థాయికి, వైసీపీ నేతల స్థాయికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, ఎవరు ప్రజల కోసం నిలబడ్డారో, ఎవరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విఫలమయ్యారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అంబటి వంటి వారి విమర్శలు రామోజీరావుపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేవని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Advertisement
Nimmala Rama Naidu
Ambati Rambabu
Ramoji Rao
Polavaram Project
Margadarsi Case
Andhra Pradesh Politics

More Telugu News