నాడు తిరుమలను కాపాడుకున్నాం, ఇప్పుడు శబరిమల కోసం పోరాడదాం: పీవీఎన్ మాధవ్

PVN Madhav calls for Hindu unity to protect Sabarimala sanctity
  • విజయవాడలో జరిగిన అయ్యప్ప గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనం
  • హిందూ ధర్మంపై నాస్తికులు దాడి చేస్తున్నారన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
  • శబరిమల పవిత్రతను కాపాడటానికి పోరాడాలని పిలుపు
  • అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి టీటీడీ కృషి చేస్తుందని హామీ
  • ఇది హిందువుల సమస్యగా భావిస్తున్నామన్న టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి
హిందూ ధర్మం, దేవాలయ వ్యవస్థలను నాశనం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని, శబరిమల పవిత్రతను కాపాడటానికి అయ్యప్ప భక్తులు, హిందూ సమాజం నడుం బిగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన అయ్యప్ప గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, నాస్తికులు, కొందరు అన్యమతస్థులు హిందూ ధర్మంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తిరుమలలో ఏడుకొండలను రెండు కొండలుగా మార్చేందుకు, ఆచారాలను మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. అప్పుడు హిందూ సమాజం పోరాడి తిరుమల పవిత్రతను కాపాడుకుందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు శబరిమల రక్షణకు కూడా పోరాడాలన్నారు. "స్వామియే శరణమయ్యప్ప అంటూనే, ధర్మాన్ని నాశనం చేసే శక్తుల పీచమణిచేందుకు కూడా సిద్ధం కావాలి" అని ఆయన ఉద్బోధించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేరళలోని ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. గతంలో టీటీడీ నిధులపై జరిగిన చర్చను ప్రస్తావిస్తూ, "వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడే కానీ, వడ్డీ వ్యాపారి కాదు" అని తాను అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు.

టీటీడీ చట్టం ప్రకారం ఇతర దేవాలయాల్లో అన్నప్రసాదం అందించేందుకు అవకాశం ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేలా మాధవ్‌తో చర్చిస్తామన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో భక్తులు లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం అయ్యప్ప భక్తుల సమస్య కాదని, యావత్ హిందువుల సమస్యగా భావించి పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.


Advertisement
PVN Madhav
Sabarimala Protection
Tirumala Temple History
Ayyappa Swamy Devotees
BJP Andhra Pradesh
Hindu Dharma Defense

More Telugu News